TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కళ్యాణ్ రాజకీయ ట్రిక్కు?

Published on: Mon Mar 2, 2015 10:23AM

 

‘పవర్ స్టార్’, జనసేన పార్టీ అధ్యక్షుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వుండే రాజకీయ నాయకుడని ఇప్పటి వరకూ అందరూ భావిస్తూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా సగటు రాజకీయ నాయకుడికంటే ఎంతమాత్రం వైవిధ్యం కాదని, ఆయన కూడా రాజకీయ ట్రిక్కులు ప్రదర్శించడం ప్రారంభించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆదివారం నాడు కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మీద, బడ్జెట్‌లో జరిగిన కేటాయింపుల మీద వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. మరోవైపు త్వరలో ప్రధానమంత్రిని కలిసేందుకు కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు అంశాలు ఇలా వుండగా, ఆయన పనిలోపనిగా రాజకీయ ట్రిక్కులు కూడా ప్రదర్శించారని పరిశీలకులు అంటున్నారు. సోమ, మంగళవారాల్లో పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో పర్యటించాల్సి వుంది. అయితే ప్రధానిని కలిసిన తర్వాతే ఆ గ్రామాలకు వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ పర్యటనకు ముందు పవన్ కళ్యాణ్ సగటు రాజకీయ నాయకుడిగా ఒక వ్యూహం పన్నారని పరిశీలకులు అంటున్నారు.

 

మొన్నామధ్య పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలని, అన్నదాతకు అన్యాయం జరగకుండా చూడాలని ట్విట్టర్లో కామెంట్లు చేసి సంచలనం సృష్టించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుదారుడైన పవన్ కళ్యాణ్ అలాంటి ట్విట్లు చేయడం చర్చనీయాంశం అయింది. పవన్ కళ్యాణ్ ఇలా ట్విట్ చేశాడో లేదో అలా రాజధాని ప్రాంత రైతులు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకుని ఒక ప్రదర్శన నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తమ ప్రాంతంలో పర్యటించి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వాళ్ళు అలా డిమాండ్ చేశారో లేదో పవన్ కళ్యాణ్ ఇలా రాజధాని గ్రామాల్లో పర్యటించడానికి డిసైడ్ అయ్యారు. అయితే సాధారణ ప్రజలందరికీ ఈ పరిణామాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి కాకతాళీయంగా జరిగిపోయినట్టు అనిపిస్తాయిగానీ, ఈ పరిణామాలన్నీ పవన్ కళ్యాణ్ ఒక క్రమ పద్ధతిలో జరిగేలాచేసినవేనని పరిశీలకులు భావిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు తనను ఆహ్వానించడం వల్లే తాను ఆ గ్రామాల్లో పర్యటించానన్న ‘కలరింగ్’ రావడానికే పవన్ ఇదంతా చేశాడని చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ ఇష్యూని చూస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ చతురతను ప్రదర్శించడం మొదలుపెట్టారని అర్థమవుతోందని పరిశీకులు అంటున్నారు.