TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సైలెంట్‌గా కేడర్‌ నిర్మాణం... పవన్‌ పిలుపునకు సూపర్‌ రెస్ఫాన్స్‌

Published on: Tue Apr 11, 2017 12:22PM

 

జనసేన పార్టీలో యువతకు పెద్దపీట వేస్తానన్న పవన్ కల్యాణ్‌... పక్కా ప్లాన్‌‌తో ముందుకెళ్తున్నారు. ఒకపక్క సినిమాలు చేసుకుంటూనే, మరోపక్క సైలెంట్‌గా పార్టీ కేడర్‌ నిర్మాణం పూర్తిచేసుకుంటూ పోతున్నారు. సమస్యలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో క్యాడర్‌ నిర్మాణం పూర్తి చేస్తే, ప్రజల తరపున గొంతు వినిపించేందుకు మార్గం మరింత సులువవుతుందని భావిస్తోన్న జనసేన అధినేత... వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రజాసమస్యలపై పార్టీ తరపున గొంతు ఎత్తేందుకు జిల్లాల వారీగా జన సైనికులను నియమించుకుంటున్నారు. అయితే ఎవరికి బడితే వాళ్లకు పార్టీ బాధ్యతలు అప్పగించకుండా ఒక వ్యూహం ప్రకారం ఎంపిక ప్రక్రియ అమలు చేస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ గ్రేడ్‌ లీడర్ల ఎంపికలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రజాసమస్యలను గుర్తించి, పోరాటం చేసే యువకులను ఏరికోరి మరీ సెలెక్ట్‌ చేసుకుంటున్నారు. అందుకే ప్రజాసమస్యలపై పోరాడే యోధులైన జన సైనికులు కావాలంటూ పవన్‌ విడుదల చేశారు. రాజకీయాల్లో నూతన ఒరవడికి నాంది పలుకుతూ ఇలా జనసేన విడుదల చేసిన ప్రకటనకు సూపర్‌ రెస్పాన్స్ వచ్చింది. ముందుగా అనంతపురం జిల్లా నుంచి కార్యాచరణ ప్రారంభించిన పవన్‌.... స్థానిక, జిల్లా, రాష్ట్రస్థాయి సమస్యలపై అవగాహన ఉన్నవారిని ఆహ్వానించారు. దాంతో అనంతపురం జిల్లా నుంచి వివిధ స్థాయిలో జనసేన కోసం పనిచేస్తామంటూ 10వేల మందికి పైగా ముందుకొచ్చారు. ఈ పదివేల మందిలోనూ అందరినీ తీసుకోకుండా, ఇంటర్వ్యూలు నిర్వహించి కొందరిని మాత్రమే ఎంపిక చేసుకోనున్నారు. ఫైనల్‌గా ఎంపికైన లిస్ట్‌ను పవన్‌ కల్యాణే అధికారికంగా ప్రకటించనున్నారు.

 

ఒక్క అనంతపురం జిల్లా నుంచే పదివేలమంది పైగా ముందుకు రావడం, గడువు ముగిసినా ఇంకా వేలకొలది దరఖాస్తులు వస్తుండటంతో జనసేన లీడర్లు ఉబ్బితబ్బితవుతున్నారు. పవన్‌ పిలుపునివ్వాలే గానీ... జనసేన పార్టీకి లీడర్లు, కార్యకర్తలకు కొదువే ఉండదంటున్నారు. ప్రజాసమస్యలపై పోరాటంలో యువత భాగస్వామ్యం కావాలన్న పవన్‌ పిలుపునకు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చిందని, త్వరలో అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో కేడర్‌ నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు.