పవన్‌ది కుల రాజకీయమా? కమ్మ, కాపు, బలిజలను ఏకం చేస్తున్నారా?
Published on: Sun Oct 3, 2021 4:43PM
పవన్‌కల్యాణ్. పుట్టుకతో కాపు. కానీ.. తనకు కులం, మతం, ప్రాంతం లేదని.. తాను భారతీయుడిని మాత్రమేనని చెబుతుంటారు. ఆ విషయాన్ని పదే పదే బహిరంగ వేదికలపై గట్టిగా, బలంగా వినిపించారు. తాను కుల రాజకీయాలు చేయబోనని స్పష్టం చేశారు. ఓ సందర్భంలో తనకు కాపు సంఘం నాయకుల మద్దతు అవసరం లేదని.. మిమ్మల్ని మద్దతు ఇవ్వాలని నేనేమన్నా అడిగానా? అని కూడా అన్నారు. ఇదంతా జనసేన స్థాపించిన కొత్తలో. కానీ, ఎక్కువ శాతం ప్రజలు జనసేనను కాపుల పార్టీగానే పరిగణించారు. అందుకే, ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. కులాల లెక్కల్లో జనసేన కొట్టుకుపోయింది. కాలం గడుస్తున్నా కొద్దీ పవన్‌కు తత్వం బోధపడినట్టుంది. కులాల ప్రస్తావన లేకుండా ఏపీలో రాజకీయంగా రాణించడం కష్టసాధ్యమని తెలిసొచ్చినట్టుంది. అందుకే కాబోలు కొన్ని రోజులుగా జనసేనాని ప్రసంగాలు కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. బలమైన వైసీపీని దెబ్బకొట్టేందుకు.. వ్యూహాత్మకంగా కుల రాజకీయం చేస్తున్నట్టున్నారు పవన్‌కల్యాణ్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కాపు, తెలగ, బలిజ, ఒంటరి.. కులాలతో పాటు కమ్మ వారిని సైతం పవన్‌కల్యాణ్ కలుపుకు పోయేలా రాజకీయం నెరుపుతుండటం జనసేన సోషల్ ఇంజినీరింగ్‌కు నిదర్శనం. తెలుగుదేశం పార్టీని కమ్మవారి పార్టీగా, జనసేనను కాపుల పార్టీగా ముద్రేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న జగన్‌రెడ్డి ఎత్తుగడకు చెక్ పెట్టేలా పవన్ వ్యూహాత్మకంగా కులాల టాపిక్ తీసుకొస్తున్నారని అంటున్నారు.
మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల పవన్‌కల్యాణ్ ప్రసంగాల్లో అడుగడుగునా కుల ప్రస్తావన వస్తోంది. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం సరికాదని.. కులాల పేరుతో వైసీపీ నేతలు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని జనసేనాని మండిపడ్డారు. కమ్మలను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెడ్డి పార్టీ అయిన వైసీపీ.. కమ్మలను శత్రువులుగా చూడటం తగదని.. పలు పోరాటాల్లో కమ్మ వర్గీయులు ప్రముఖ పాత్ర వహించారంటూ చెప్పుకొచ్చారు. ఇలా పవన్‌కల్యాన్ సడెన్‌గా కమ్మ కులానికి మద్దతుగా స్టేట్‌మెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. పీకేపై కాపు అనే ముద్ర వేసి.. కమ్మ వారు ఆయన్ను దూరం పెట్టారని అంటారు. ఆ వర్గమంతా టీడీపీకి మద్దతుదారులుగా ఉన్నారు. తాను కమ్మలకు వ్యతిరేకం కాదనే భావన కలిగేలా.. వైసీపీ ప్రభుత్వం కమ్మలను టార్గెట్ చేయడం సరికాదన్నట్టు చెప్పడం ఆ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నంలో భాగమే అంటున్నారు.
ఇక, అన్ని కులాల్లో గొప్ప వ్యక్తులు ఉంటారంటూ.. తాను ఏ కులానికీ వ్యతిరేకం కాదన్నారు పవన్‌కల్యాణ్. మంగళగిరి సమావేశంలో కాపు నాయకుడిగా పేరొందిన వంగవీటి రంగా హత్య గురించి పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించడం కాకతాళీయం కాకపోవచ్చు. ఇక, రాజమండ్రి సభలోనూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి.. కులస్తులంగా ఐక్యంగా ముందుకు కదలి.. మిగతా వర్గాలకూ నాయకత్వం వహించి.. రాజ్యాధికారం సాధించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బలమైన మద్దతుగా నిలిచే కాపులను తెలగ, బలిజ, ఒంటరిలతో సహా మిగతా వెనకబడిన వర్గాలు, దళితులను అందరినీ కలుపుకు పోయేలా పవన్ ప్రసంగం సాగడం ఆసక్తికరంగా మారింది. పవన్-కాపు అంటూ తనను మిగతా వర్గాలు పక్కన పెట్టేయకుండా.. ఇలా అన్ని కులాల ప్రస్తావన తీసుకొస్తూ.. మెజార్టీ వర్గాలకు దగ్గర కావాలనేదే పీకే ప్రయత్నంలా కనిపిస్తోంది. అందుకే, పవన్ వ్యాఖ్యలకు.. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. కమ్మ కులస్థులకు.. రెడ్డి కులస్తులు వ్యతిరేకమని, కాపు కులస్తులు కాదని అన్నారు.
పనిలో పనిగా తాను రెడ్డి వర్గానికీ వ్యతిరేకం కాదని.. కేవలం వైసీపీకి మాత్రమే వ్యతిరేకం అనే భావన కలిగేలా.. అనంతపురం సభలో మరో ఆసక్తికర స్టేట్‌మెంట్ ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎందరో తన దగ్గర బాధలు చెప్పుకున్నారన్నారు. జిల్లాలో తమ పార్టీ నాయకుడు చిలకం మధుసూదనరెడ్డిపై అన్యాయంగా కేసులు పెట్టారని.. టీడీపీకి చెందిన జేసీ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ఈ విషయాలు తనకు ఆవేదన, బాధ కలిగించాయన్నారు. ఇలా, రెడ్లనూ మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్‌కల్యాణ్.
ఇలా, కులాల వారీగా ప్రాంతాలను బట్టి పవన్‌కల్యాణ్ చేస్తున్న ప్రసంగాలు ఫక్తు రాజకీయ నాయకుడి మాటల్లా ఉన్నాయి. కాదు కాదంటూనే.. జనసేనాని సైతం క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు. వైసీపీని గద్దె దించేందుకు.. ఆ పార్టీ తరహాలో కులాల రాజకీయం చేస్తే తప్పేముందని సమర్థించేవారూ లేకపోలేదు. మరి, ఈ తరహా ప్రసంగాలు.. పవన్‌ను ఆయా కులాలకు దగ్గర చేస్తాయా? పీకే లక్ష్యం నెరవేరుతుందా?


