మోదీ టూ పవన్ … కరుణానిధి మృతిపై ఇలా రియాక్టయ్యారు!

తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన తన ట్వీట్ లో … ఈ విషాద సమయంలో నా ఆలోచనలు కరుణానిధి కుటుంబం చుట్టూ, ఆయన అభిమానుల చుట్టూ తిరుగుతున్నాయి. భారత దేశం … ముఖ్యంగా తమిళనాడు గొప్ప నేతని కోల్పోయింది. కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు! మోదీ చెన్నై చేరుకుని కరుణానిధి భౌతికకాయానికి స్వయంగా నివాళులర్పించనున్నారు…

 

 

ఇక మన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తమ సంతాపం వ్యక్తం చేశారు. వారు వేర్వేరు ప్రకటనల్లో తమ భావాలు పంచుకున్నారు. కరుణానిధి మరణ వార్త యావత్తు దేశానికే తీరని లోటని జన్మతః తమిళుడైన నరసింహన్ అన్నారు…

 

 

ఆంధ్రా సీఎం చంద్రబాబు తమ సందేశంలో… దేశం రాజకీయ యోధుడిని కోల్పోయిందన్నారు. సాహిత్య, సినీ, పత్రికా, రాజకీయ రంగాల్లో కలైంగర్ విశేష కృషి చేశారని కొనియాడారు. సేవాభావం, పాలనా అనుభవంతో ప్రజల గుండెల్లో కరుణానిధి నిలిచిపోయారని కీర్తించారు. నిరుపేదలు, బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పరితపించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు…

 

 

తమిళ దిగ్గజ నేత మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్పందించారు. చెన్నైలో జరగబోయే కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొనబోతున్న ఆయన… కరుణ ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తి అని శ్లాఘించారు. దేశ రాజకీయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ పేర్కొన్నారు….

 

 

కరుణానిధి బాటలోనే సినిమాల నుంచీ రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తుదిశ్వాస విడవడం తనని విషాదంలో ముంచిందన్నారు. ద్రవిడ ఉద్యమ తపోపుత్రుడంటూ ‘కలైంగర్’ ను కీర్తించిన ఆయన…  కరుణానిధి అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారని ఆశించినట్లు చెప్పారు. వారి అస్తమయం కేవలం తమిళనాడుకే కాదు యావత్ దేశానికీ తీరనిలోటన్నారు. ముఖ్యంగా, దక్షిణ భారతదేశానికి కరుణానిధి లేని లోటు తీరేది కాదన్నారు. కరుణానిధి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన పవన్ ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు…