నేను ఎన్టీఆర్‌లా అమాయకుణ్ని కాదు: పవన్

పశ్చిమ గోదావరి జిల్లాలో ‘జనపోరాట యాత్ర’ సభల్లో ప్రసంగించిన పవన్ కళ్యాణ్.. టీడీపీ, వైసీపీలపై తీవ్ర విమర్శలు చేసారు.. ‘వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరుండాలి? చంద్రబాబా, జగనా, నేనా? మీరే నిర్ణయించుకోండి’ అని పిలుపునిచ్చారు.. 'వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటు.. లోకేష్ కూడా వెన్నుపోటుతో సీఎం కావాలనుకుంటే కుదరదు.. మీరు వెన్నుపోటు పొడుస్తుంటే పొడిపించుకునేందుకు నేను ఎన్టీఆర్‌లా అమాయకుణ్ని కాదు.. వెన్నుపోటు రాజకీయాలపై జనసైన్యం తిరగబడుతుంది’ అని తెలిపారు.

 

 

‘జగన్‌ లక్ష కోట్లు దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తారు.. టీడీపీ వాళ్లు లక్షన్నర కోట్లు తిన్నారని జగన్‌ విమర్శిస్తారు.. అంటే రాజకీయాల్లో వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందనేగా అర్థం.. అటువంటి దోపిడీని జనసేన అరికడుతుంది’ అన్నారు.. అదేవిధంగా 'పవన్ కార్లను మార్చినట్టు భార్యలను మారుస్తున్నాడని' జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు.. 'జగన్‌ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు.. నా జీవితంలో రహస్యాలంటూ ఏమీలేవు.. పవన్‌కు మూడు పెళ్లిళ్లా అని దెప్పి పొడుస్తున్నారు.. నా కర్మ! ఒకే పెళ్ళి కుదరలేదు.. నేనేం చేయను.. ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదు పెళ్లిళ్లు.. నేను మీలాగా బలాదూర్‌ను కాదు' అన్నారు.