లోకేష్ ను వేధించిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలి: పవన్
Published on: Thu May 21, 2020 2:00PM
తాడేపల్లిగూడెంకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఉన్నమట్ల లోకేష్.. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిసి ఎంతో బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. లోకేష్ ను సీఐ రఘు వేధించినట్టు తమకు తెలిసిందని, ఆ సీఐ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోందన్నారు. అక్రమాలను ప్రశ్నించిన వారిని వేధించడం చట్ట సమ్మతమా? అని ప్రశ్నించారు. పోలీసులు ప్రజలకే జవాబుదారీ తప్ప అధికార పక్షానికి కాదని హితవు పలికారు.
లోకేశ్‌కు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని జిల్లా నాయకులకు పవన్ సూచించారు. పోలీసు వేధింపులు, అధికార పార్టీ నాయకుల వేధింపులపై ప్రజాస్వామ్య ధోరణిలో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతోపాటు, ఆ ప్రాంతంలో అధికార పక్షం చేస్తున్న ఇసుక దందా వంటి అక్రమాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా నాయకులకు పవన్ సూచించారు.


