ఏపీ బీజేపీ నాయకత్వం తీరు... ఏమీ బాగోలేదట!

తిరుపతిలో మేమే పోటీ చేస్తాం

 

ఏకపక్షంగా అభ్యర్ధిని ఎలా ప్రకటిస్తారు?

 

అమరావతి-పోలవరంపై స్పష్టత కావలసిందే

 

జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ కావాలన్న పవన్

 

నద్దాతో జనసేనాధిపతి భేటీ

 

బీజేపీ ఏపీ నాయకత్వ పనితీరుపై జనసేనాధిపతి పవన్‌కల్యాణ్.. ఆ పార్టీ జాతీయ దళపతి నద్దాకు ఫిర్యాదు చేశారా? అమరావతిపై జీవీఎల్, సోము, విష్ణువర్దన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను, జనసేనాధిపతి కమలదళపతికి ఫిర్యాదు చేశారా? అమరావతిలోనే రాజధాని ఉండాలన్న విషయంపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని కోరారా? వీటికి మించి... తిరుపతి లోక్‌సభ ఎన్నికలో తమ పార్టీ పోటీచేస్తుందని స్పష్టం చేశారా? అసలు తమతో సంప్రదింకుండానే ఎంపీ జీవీఎల్.. బీజేపీ అభ్యర్ధి పోటీ చేస్తారని ప్రకటించడంపై పవన్ అగ్గిరాముడయ్యారా?.. తాజాగా ఢిల్లీలో బీజేపీ బాస్ నద్దాతో, జనసేనాధిపతి పవన్ భేటీ వివరాలివేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

 

జనసేన  వర్గాల సమాచారం ప్రకారం... రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో,  జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేశారట. బీజేపీ నాయకత్వ సూచన ప్రకారం తాము గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నందున, తిరుపతి లోక్‌సభ తమకే ఇవ్వాలని పవన్, బీజేపీ బాసును కోరారట. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న తమ అభిప్రాయం తెలుసుకోకుండా, తమతో చర్చింకుండానే తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు  చెబుతున్నారు. అసలు తాము తిరుపతి విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని, అయితే ఏదో లీకు వార్తలకు బీజేపీ నేతలు  స్పందించడమంటే.. తమను అవమానించినట్లేనని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

 

అదేవిధంగా అమరావతి అంశంపై,  రాష్ట్ర బీజేపీ నాయకత్వం వ్యవహారశైలిపై పవన్ ఫిర్యాదు చేశారట. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది జనసేన విస్పష్ట విధానమని, కానీ జీవీఎల్-సోము వీర్రాజు-విష్ణువర్దన్‌రెడ్డి అందుకు విరుద్ధమైన ప్రకటలిచ్చి,  రైతుల్లో గందరగోళం రేపడాన్ని నద్దా వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. బీజేపీ అమరావతికి అనుకూలమని చెబితేనే, తాను మీకు మద్దతునిచ్చిన విషయాన్ని నద్దాకు గుర్తు చేశారట. దీనిపై ఏపీ నాయకత్వం స్పష్టతనివ్వాలని సూచించారు. రాష్ట్ర  బీజేపీ నాయకత్వం, తాము ఆశించిన స్థాయిలో జగన్ ప్రభుత్వంపై పోరాడటం లేదని.. కొన్ని సంఘటనలు-అంశాలను నద్దా దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.

 

అటు పోలవరంపైనా గందరగోళం నెలకొందని, ఆ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని పవన్ కోరారట. అయితే ఆ విషయంలో కేంద్రం ఒకే అభిప్రాయంతో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రావడంలో ఆలస్యమవతుతోందని నద్దా వివరించారట. రెండు పార్టీల మధ్య కీలక అంశాల్లో అభిప్రాయబేధాలు తలెత్తుతున్నందున, తక్షణమే రెండు పార్టీలతో సమన్వయ కమిటీ వేయాలని పవన్ సూచించారట.  అందుకు నద్దా అంగీకరించినట్లు చెబుతున్నారు. తాము హైదరాబాద్‌కు వస్తున్నందున, మరోసారి అక్కడ చర్చిద్దామని పవన్‌తో అన్నారట. 

-మార్తి సుబ్రహ్మణ్యం