TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవర్ అంతా సినిమాల్లోనే ఉంది..అదే రాజకీయానికీ

Published on: Wed Jun 9, 2021 2:08PM

సినిమాల్లో కరవాలం బాగా తిప్పుతున్నాడు కాని.. రాజకీయంలో తిప్పేదెప్పుడు అని ప్రశ్నలు వస్తున్నాయి. అయినా గాని జనసేనాని మాత్రం వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఒక్కో ప్రాజెక్టు అనౌన్స్ అవుతుంటే.. వకీల్ సాబ్ ఊపులో ఉన్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం పవన్ బయటకి రారా అని కామెంట్లు.. దానికి జనసైనికుల కౌంటర్లతో గొడవ నడుస్తోంది. పవన్ మాత్రం పీస్ ఫుల్ గా పోస్ట్ కరోనా రెస్ట్ అంటూ.. కాలం గడిపేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

తిరుపతి ఉపఎన్నికల సమయంలో బిజెపి వాళ్లు తమ కూటమి సీఎం అభ్యర్ధి పవన్ కల్యాణ్ అనగానే జనసైనికులు ఉర్రూతలూగారు. కాని తర్వాత పవన్ ప్రచారానికి రాకపోవడం.. కరోనా రావడం వీటన్నిటితో డీలాపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూసి అవాక్కయ్యారు. అయినాగాని వకీల్ సాబ్ విజయంతో మైమరిచిపోయారు. తిరుపతి సంగతే వదిలేశారు. తర్వాత అడపా దడపా ప్రెస్ స్టేట్ మెంట్లు తప్ప.. ఇంకేమీ లేవు. కరోనా కదా..ఎలా వస్తారని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.
మళ్లీ టీడీపీ మహానాడుతో పవన్ కల్యాణ్ వ్యవహారం చర్చకు వచ్చింది. టీడీపీ బిజెపి కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీ మద్దతు ఇవ్వడానికి సిద్ధమని.. ప్రకటించడంతో... బిజెపికి స్నేహహస్తం చాచారనే కథనాలు వచ్చాయి. ఆ వెంటనే బిజెపి నేతల ఖండనలు కూడా వచ్చాయి. తాము ఎట్టిపరిస్ధితుల్లో జనసేనతో కలిసే ముందుకు వెళతామని..ఇంకెవరితోనూ పొత్తులుండవని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ రచ్చ మొదలైంది.

సినిమాలు చేసుకుంటూ.. రాజకీయాలకు అప్పుడప్పుడు టైమ్ ఇచ్చే పవన్ కల్యాణ్ నే బిజెపి నమ్ముకుందంటూ కామెంట్లు మొదలయ్యాయి. దీంతో జనసైనికులు కొందరు కౌంటర్ వీడియోలను కూడా వదిలారు. ఏ నాయకులు తిరుగుతున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. అయితే ఓ రాజకీయ పార్టీ అధినేతగా..అన్ని అంశాలపై స్పందించాలని..కాని స్పందించటం లేదనే విమర్శలకు మాత్రం జనసైనికులు కూడా స్పందించలేదు.

ఇలా సినిమాల్లో బిజీ అయిపోతే.. రాజకీయాలు కేవలం నాదెండ్ల మనోహర్ మాత్రమే చేస్తే..ఎలా ఎదుగుతామనే ప్రశ్నలు కొందరు వేస్తున్నారు. అయితే వకీల్ సాబ్ మళ్లీ పవన్ క్రేజ్ రేంజ్ చూపించిందని..అలా వరుస సినిమాలు చేస్తేనే క్రేజ్ పెరుగుతుందని.. అప్పుడే రాజకీయాల్లో కూడా వర్కవుట్ అవుతుందనే ఫార్ములాను జనసైనికులు వినిపిస్తున్నారు. అప్పుడే డిమాండ్ కూడా పెరుగుతుందని..బిజెపి సైతం చెప్పిన మాట వింటుందనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్నారు. పైగా తమ నాయకుడికి దీర్ఘకాలిక వ్యూహం ఉందని.. హడావుడి పడాల్సిన అవసరం కూడా లేదంటూ వాదిస్తున్నారు. 

కాని ప్రజల్లో తిరగకుండా..ప్రజా సమస్యలపై ఇన్ వాల్వ్ కాకుండా.. ఉంటే ఎలాఎదుగుతారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు, జగన్..వీరంతా కష్టపడకుండా ఉంటే లక్ష్యాన్ని చేరేవారా అని కూడా అడుగుతున్నారు. పాదయాత్రలు చేయకపోయినా.. కనీసం రెగ్యులర్ గా కార్యకర్తలతో అయినా చర్చలు జరపకుండా.. సినిమా షూటింగులతో గడిపేస్తే ఎలా కుదురుతుందని నిలదీస్తున్నారు.