తండ్రి మాటపై జగన్ కి గౌరవం లేదా?: పవన్

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో సన్నిహితంగా ఉండటాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ, జగన్‌లపై ధ్వజమెత్తారు. 'మోదీ దేశానికి ప్రధాని అయితే మంచి రోజులు వస్తాయని కలలుగన్నాం. అండగా ఉంటారని ప్రేమతో ఎన్నుకున్నాం.. భయపెట్టి పాలిస్తామంటే మేం భయపడం.. ఆంధ్రులు దేశ పౌరులు కాదా? మా పోలవరం ప్రాజెక్టును ఎందుకు కట్టరు? మా రైతులకు ఎందుకు అండగా నిలవరు? చంద్రబాబు మీద కోపం ఉంటే ఆయనపై చూపించుకోండి.. ఆంధ్ర ప్రజలను శిక్షిస్తామంటే ఎలా?’ అని పవన్‌ ప్రశ్నించారు.  

ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ.. వైసీపీకి దొడ్డి దారిన అండగా ఉందని పవన్‌ విమర్శించారు. జగన్‌ దీనికి బదులివ్వాలి. బీజేపీతో ఎందుకు కలిశారో స్పష్టత ఇవ్వాలి అని డిమాండ్‌ చేశారు. బీజేపీతోపాటు టీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌, హరీష్ రావులతో తనకు జగన్‌ కంటే ఎక్కువ సాన్నిహిత్యం ఉందని.. అయితే, రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేటప్పటికి వాళ్లతో విభేదించానని తెలిపారు. తెలంగాణ విడిపోతే ఏమవుతుందో అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోతే పాస్‌పోర్టుతో అక్కడికి వెళ్లాల్సి వస్తుందని 2009 గుంటూరు సభలో వైఎస్‌ చెప్పారు. ఆయన కొడుకుగా జగన్‌ ఆ మాటలు మరిచిపోయారు. తండ్రి మాటపై గౌరవం అదేనా? ఇలాగేనా మీ నాన్న అడుగుజాడల్లో నడిచేది?' అని పవన్‌ ప్రశ్నించారు. 'ఇక్కడ చంద్రబాబు పోటీ చేయొచ్చు. జగన్‌ పోటీ చేయొచ్చు. కానీ.. కేసీఆర్‌ను ఎందుకు తెస్తారు? ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిన వ్యక్తులకు అండగా ఉండడం మంచిది కాదు. బీజేపీ, కేసీఆర్‌తో మీకెందుకు? వాళ్లతో కలసి ఉన్న నేనే విభేదించాను. మీరు బయటకు రాకుండా ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కాపాడగలరా?’ అని జగన్‌ను ప్రశ్నించారు. ‘కొందరు జనసేనకు కేవలం గోదావరి జిల్లాలే బలం అన్నారు. నన్ను కాపులా చూస్తున్నారా? నాకు కులం లేదు. శ్రీకాకుళం నాది, విశాఖ నాది, బొబ్బిలి నాది, కోస్తా నాది, రాయల సీమ నాది!’ అని పవన్‌ అన్నారు.