పాలించాల్సింది ఏపీ సీఎంగా.. వైసీపీ చీఫ్ గా కాదు: పవన్

 

ఏపీ రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రాజధానిపై మంత్రి బొత్స చేసిన ప్రకటనలపై ఆందోళన చెందిన రాజధాని రైతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో పవన్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో రాజధాని ప్రాంతంలో పర్యటించి, అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే పవన్ అమరావతి పర్యటనకు వచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాజధానిలో పర్యటిస్తున్న పవన్.. కురగల్లు గ్రామస్థులతో సమావేశమయ్యారు. రాజధానిపై మంత్రి ప్రకటనలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు కొందరు మహిళలు పవన్‌కు వివరించారు. 

అనంతరం మాట్లాడిన పవన్.. రాజధాని విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధానిని పొలిటికల్ గేమ్‌గా చూడొద్దన్న పవన్.. అమరావతిని రాజధానిగా ఉంచుతారా ? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. రాజధానిని తరలిస్తామంటే జనసేన ఒప్పుకోదన్నారు. రాజధాని ప్రాంత రైతులకు, ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. రాజధాని ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని పనవ్ హామీ ఇచ్చారు. రాజధాని విషయంపై ప్రకనటలు చేసే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడాలని మంత్రి బొత్స‌కు పవన్ సూచించారు.

రాజకీయాలు చేయడానికి రాలేదన్న పవన్.. గత టీడీపీ ప్రభుత్వ సమయంలో కూడా.. భూ సేకరణ చట్టం ఉపయోగించి, భూములివ్వడం ఇష్టం లేని రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవద్దని తాము చెప్పారని గుర్తు చేసారు. ఆ సమయంలో తమ దగ్గరకు అండగా ఉండమని అడిగింది కూడా వైసీపీ వారే అని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా.. రైతులకు అప్పుడూ అండగా ఉన్నాం, ఇప్పుడూ ఉంటాం అని పవన్ స్పష్టం చేశారు.

అక్రమాల పేరు చెప్పి రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదు అన్నారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే విచారించి, అవినీతి ఉందని తేలితే చర్యలు తీసుకోవాలి అన్నారు. జగన్ రెడ్డి వైసీపీ అధినేత పాలన సాగిస్తున్నారు.. తప్ప సీఎం గా  భావించడం లేదు అని విమర్శించారు. ఈ ప్రాంత రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప టీడీపీకి కాదని, ఈ విషయాన్ని జగన్ గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా ప్రకటన  చేయాలని హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణ కు మేం వ్యతిరేకం కాదు.. ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకోం అని హెచ్చరించారు.

"రాజధాని విషయంలో అవసరమైతే ప్రధాని మోడీ, అమిత్ షా లను కలుస్తాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోతే  ఎంత దూరమైనా పోరాటం చేస్తాం. మంత్రి బొత్స పరిస్థితులను అర్థం చేసుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారు. రాజధాని రైతుల్లో నెలకొన్న ఆందోళన పై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి. తిరుగులేని విజయాన్ని అప్పగించిన జగన్ రెడ్డి ఇంకా ఎందుకో ఆందోళన చెందుతున్నారు. వంద రోజుల వరకు మాట్లాడకూడదు అని మేం భావించినా..  ప్రభుత్వం మేము మాట్లాడేలా‌ చేసింది. రాజధాని రైతులు భూములిచ్చి, పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. 90 రోజుల జగన్ పాలనలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మంచి చేస్తారని సీఎంను‌ చేస్తే.. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది.రైతుల కు జనసేన అండగా ఉంటుంది." అని పవన్ స్పష్టం చేశారు.