నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు.. సహనాన్ని పరీక్షించొద్దు.. జగన్‌కు పవన్ వార్నింగ్
Published on: Fri Apr 8, 2022 6:52PM
ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడితే తనను వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అని దూషిస్తున్నారని.. వ్యక్తిగత దూషణలకు దిగితే ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసునంటూ సీఎం జగన్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. నోటికి వచ్చినట్టు మాట్లాడి తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు జనసేనాని.
సెల్‌ఫోన్ వెలుతురులో ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు, ప్రసవాలు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోందన్నారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున అనధికార విద్యుత్ కోతలు విధించడంతో జనం అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాలు, అనాలోచిత విధానాలే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమని జనసేనాని ఆరోపించారు.
విద్యుత్ ఛార్జీలు భారంగా పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేశారన్నారు. విద్యార్థులు, పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రలేక ఒత్తిడికి గురవుతున్నారన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేదని, అప్పుడు విద్యుత్ కోతల ప్రభావం పెద్దగా ఉండేది కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజి అగ్రిమెంట్లు రద్దు చేసిందని, యూనిట్ రూ.4.80 చొప్పున 25 ఏళ్లపాటు గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసిందని.. యూనిట్ రూ.2లకే గ్రీన్ ఎనర్జీ తీసుకొస్తామని చెప్పి.. ఇప్పుడేమో కోల్ ఎనర్జీని రూ.20లు పెట్టి కొంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి లోపభూయిష్ట నిర్ణయాల వల్లే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు.
పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని, తాజాగా మరో రోజు వపర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడనున్నాయని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరం పని చేసే పరిశ్రమలు ఇప్పుడు వాడుతున్న విద్యుత్‌లో ఇక పై 50 శాతం మాత్రమే వాడాలనే నిబంధన విధించారని, దీంతో రూ.కోట్లు పెట్టుబడి పెట్టిన పారిశ్రామిక వేత్తలు విద్యుత్ కోతలతో నష్టాల పాలవుతున్నారన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుందని, 36లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు.
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించే వరకు వైసీపీ అనాలోచిత విధానాలతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జన సైనికులను ఉద్దేశించి పవన్ మాట్లాడారు.


