TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నవరత్నాలపై పవన్ నవ సందేహాలు!

Published on: Fri Jul 8, 2022 4:26PM

ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో, జగన్ రెడ్డి ఏలుబడిలో జరుగుతున్న అవకతవకలు, అవినీతిపై సందర్భం చిక్కినప్పుడల్లా విమర్శలు ఎక్కుపెడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా నవ రత్నాలు అమలుపై ‘నవ’ సందేహాలు వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలపై నవ సందేహాలు అంటూ పవన్ కళ్యాణ్  ట్వీట్ చేశారు. నవరత్నాలు పేర  జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, అమ్మ ఒడి, పింఛన్లు, సంపూర్ణ మద్యపాన నిషేధం, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలందరికీ ఇళ్లు, ఆసరా పథకాలపై జనసేనాని ప్రశ్నాస్త్రాలు సంధించారు.

నవరత్నాల్లోని ‘మొదటి రత్నం’ రైతు భరోసాతో 64 లక్షల మంది రైతులకు మేలు అని చెప్పిన జగన్ రెడ్డి సర్కార్ 50 లక్షల మందికి మాత్రమే భరోసా ఇవ్వడం నిజం కాదా? పవన్ తన ట్వీట్ లో ప్రశ్నించారు.  వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 7 వందల మందికి మాత్రమే ఆర్థిక సాయం పరిమితం చేయలేదా? అని నిలదీశారు. ఇక ‘రెండో రత్నం’ అమ్మ ఒడిని 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి, 83 లక్షల మందికి ఇచ్చినట్లు ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు.

‘మూడో రత్నం’ పింఛన్ల విషయంలో  పింఛనర్ల జాబాతాను కుదించి, 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?, అలాగే ‘నాలుగో రత్నం’ సంపూర్ణ మద్యపాన నిషేధంపై జనసేనాని ప్రశ్నలు సంధించారు. మద్యం ఆదాయం 2018- 19లో 14 వేల కోట్లు ఉంటే.. 2021-22లో 22 వేల కోట్ల రూపాయలకు పెరగాడాన్ని సంపూర్ణ మద్యనిషేధం అంటారా?  ఈ ఆదాయం చూపించి 8 వేల కోట్ల రూపాయల విలువైన బాండ్లు అమ్మలేదా? అంటూ ఎత్తి చూపారు.

అలాగే ‘ఐదో రత్నం’ జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకును ‘యుద్ధ ప్రాతిపదికన’ ఎప్పుడు పూర్తిచేస్తారో చెబుతారా? అన్న జనసేనాని ‘ఆరో రత్నం’ ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆస్పత్రులు ఎందుకు పక్కకు తప్పుకుంటున్నాయి? సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు’, ‘ఏడో రత్నం’ ఫీజు రీయింబర్స్ మెంట్ లో పీజీ విద్యార్థులకు ఎందుకు  చెల్లింపులు నిలిపేశారని నిలదీశారు, రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్లను ఆయా విద్యా సంస్థలు ఆపేస్తున్న మాట నిజం కాదా? అని ప్రశ్నించారు.

 

‘ఎనిమిదో రత్నం’ పేదలందరికీ ఇళ్లలో భాగంగా చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు మంజూరు చేయలేదని జనసేనాని నిలదీశారు. చివరిగా ‘తొమ్మిదో రత్నం’ ఆసరాలో ఏటేటా పొదుపు సంఘాల సంఖ్యను లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారని పవన్ నిలదీశారు. అభయ హస్తం నిధులు 2 వేల కోట్ల రూపాయలు ఎటు పోయాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.