కోడెల రాజకీయంగా పోరాడి ఉంటే బాగుండేది: పవన్

 

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కోడెల మృతికి పవన్ ఓ ప్రకటనలో సంతాపం తెలియజేశారు. రాజకీయనాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా కోడెల ఎన్నో పదవులు చేపట్టారని పేర్కొన్నారు. రాజకీయపరమైన ఒడిదుడుకులు తట్టుకోలేక కోడెల తుదిశ్వాస విడవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ​తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొని ఉంటే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు పవన్ తెలిపారు.