ఆస్పత్రి నుంచి పవన్ కల్యాణ్ డిశ్ఛార్జ్.!
Published on: Wed Jul 15, 2026 9:44AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ ఆస్పత్రిలో ఆయన భుజానికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. సర్జరీ సక్సెస్ అయిన తరువాత కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉన్న పవన్ కల్యాణ్ బుధవారం జులై 15) ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే వైద్యుల సూచన మేరకు ఈ నెల 10న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్య బృందం ఆయన కుడి భుజానికి సర్జరీ చేసింది.
సర్జరీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ గత నాలుగు రోజులుగా అక్కడి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ.. వేగంగా కోలుకుంటున్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ, ఆయన సంపూర్ణంగా కోలుకోవడానికి మరికొన్ని రోజుల పాటు ఖచ్చితంగా పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ముంబై వెళ్లి ఆయనను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం, ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారనే సమాచారంతో జనసేన శ్రేణులు, తెలుగుదేశం కూటమి నేతలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో త్వరలోనే రాష్ట్ర విధుల్లో పాల్గొనాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
Pawan Kalyan shoulder surgery, Kokilaben Hospital Mumbai, AP Deputy CM Pawan Kalyan


