అడ్డగోలుగా జిల్లాల విభజన.. సరైన అధ్యయనం లేదన్న జనసేన..
Published on: Mon Apr 4, 2022 12:41PM
ఏపీలో జిల్లాల విభజన కొత్త చిచ్చు రేపుతోంది. ప్రజల డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఇష్టారీతిన కొత్త జిల్లాలను తీసుకొచ్చిందని మండిపడుతున్నారు. సరైన కసరత్తు లేకుండా విభజించడంతో.. ఇప్పటికీ అనేక ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు చాలా దూరమై పోయాయి. ఇన్నాళ్లూ అనుభవించిన సమస్యలో మళ్లీ మొదలయ్యాయని కొన్ని జిల్లాల వాసులు పెదవి విరుస్తున్నారు. తమకు కొత్త జిల్లాలతో పెద్దగా ఒరిగిందేమీ లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ప్రభుత్వాన్ని విమర్శించారు.
ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా రాష్ట్రంలో జిల్లాల విభజన చేశారని పవన్‌కల్యాణ్ ఆరోపించారు. పాలకుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్లారని మండిపడ్డారు. విభజన లోపభూయిష్టంగా సాగిందని.. జిల్లా డిమాండ్ ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం అధ్యయనం కూడా చేయలేదన్నారు.
జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందన్నారు పవన్ కల్యాణ్. కాకినాడ కేంద్రంగా ఉన్నప్పుడూ ఇదే తరహా ఇబ్బందులు వచ్చాయని.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కూడా అవి తప్పడం లేదన్నారు. రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉండాలన్న గిరిజనుల అభిప్రాయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని చెప్పారు. మదనపల్లె, హిందూపురం, మార్కాపురం జిల్లా కేంద్రాలుగా ఉండాలని ప్రధాన డిమాండ్లు వచ్చాయని గుర్తు చేశారు. జిల్లాల విభజనతో ముంపు మండలాల గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఈ విషయంలో ప్రజల నిరసనకు జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు.


