కాంగ్రెస్,తెదేపా మైత్రి బంధం..చంద్రబాబు జగన్‌తోనూ కలిసే అవకాశం

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,తెదేపా పార్టీలు పొత్తుతో ఒక్కటయ్యాయి.అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ పాలనపై తిరుగుబాటు చేసేందుకు బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం,తెదేపా అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు.సమావేశ అనంతరం ఇద్దరు కలిసి వచ్చి మీడియాతో మాట్లాడారు.దేశ సమగ్రత కొరకే మా కలయిక అని తెలియజేసారు.గతాన్ని మరచి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు.ఇరు పార్టీల అధ్యక్షులే గతాన్ని మరచిపోవాలి అనుకుంటుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలను తిరగతోడుతున్నారు.దీన్ని అస్త్రంగా మార్చుకొని రాజకీయంగా లాభం పొందాలని భావిస్తున్నారు.. 

తాజాగా కాంగ్రెస్,తెదేపా మైత్రి భంధంపై ఆయన ఫేస్‌బుక్‌ వేదికగా విమర్శలు చేశారు.గతంలో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీపై చంద్రబాబు చేసిన విమర్శల్ని పవన్ తన ఫేస్ బుక్‌ లో పోస్టు చేశారు. ఒకప్పుడు తిట్టుకున్న నేతలు ఇప్పుడు ఒకటవ్వడం అవకాశవాదం కాక మరేంటని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయం మరిచి తెలుగు వారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని ఘాటుగా విమర్శించారు. త్వరలో చంద్రబాబు జగన్‌తోనూ కలిసే అవకాశం లేకపోలేదని ఎద్దేవా చేశారు. అసంబద్ధంగా జరిగిన రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, భాజపా రెండూ కారణమేనన్నారు. హైదరాబాద్ నుంచి మనల్ని గెంటేయడంలో ఆ రెండు పార్టీలది కీలకపాత్ర అని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనుభవజ్ఞులైన నాయకులు ఈ విషయంలో సిగ్గుపడాలన్నారు.