సముద్రం ఒకరి కాలి దగ్గర కూర్చోదు... పర్వతం ఎవ్వరికీ ఒంగి సలాం చేయదు...

 

సముద్రం ఒకరి కాలి దగ్గర కూర్చుని మొరగదు.. పర్వతం ఎవ్వరికీ ఒంగి సలాం చేయదు.. మనమంతా పిడికెడు మట్టే కావచ్చు.. కానీ మన జెండా ఎత్తితే.. ఉవ్వెత్తున ఎగసి పడే గుండె ధైర్యం..దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఆత్మగౌరవం నినాదం రెపరెపలాడుతుంటూయి.. ఇవన్నీ యువత గుర్తు పెట్టుకోవాలి.. ఇంతకీ ఈ మాటలు చెబుతున్నది ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ది ఫస్ట్ వార్ ఇండియన్ ఇండిపెండెన్స్ మే 10, 1857 సిపాయిల తిరుగుబాటును గుర్తు చేస్తూ.. వైబ్రాంట్స్ ఆఫ్ కలాం అనే స్వచ్ఛంద సంస్థ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ... పై వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. జాతీయ జెండా అంటే ఓ కులానికో, మతానికో, రాజకీయ పార్టీకో చెందినది కాదన్నారు. స్వలాభం కోసం చాలా మంది రాజకీయాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో యువత ప్రపంచంలోనే అతి పెద్ద జెండాని ఆవిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టడం వారి ఔన్నత్యాన్ని చాటి చెబుతోందన్నారు. ఆ తరువాత భారతీయుడినైన నేను.. భారతీయుడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ.. అందరితో కలిసి దేశ భక్తి ప్రతిజ్ఞ చేశారు.