ఆ పేపర్లు ఎందుకు చదవాలి?.. ఆ టీవీలు ఎందుకు చూడాలి?

 

గత మూడు నాలుగు రోజుల నుండి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మీడియా ఛానెళ్లపై వార్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ దగ్గర మొదలైన ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి పవన్ కళ్యాణ్ కుటుంబంపై వ్యక్తిగత దూషణకు దిగేవిధంగా మారింది. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా రాజకీయం దిశగా మారింది. పవన్ కళ్యాణ్ ని, అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని.. పవన్ అభిమానులతో పాటు పలువురు అనుమానాలు వ్యక్తపరిచారు. ఇక దీనిపై పవన్ కూడా స్పందించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఆరునెలలుగా తన గురించి టీవీ ఛానళ్లలో డిబెట్లు పెట్టి తిట్టిపోశారని.. ఇప్పుడు ఏకంగా తన తల్లినే తిట్టించే స్ధాయికి దిగజారారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పవన్... ఈ విషయం వెనుక ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసని.. తనపై జరుగుతున్న కుట్రను, అవమానాలకు కొందరు వ్యక్తులు కారణమని.. కొంత మంది పేర్లను కూడా బహిరంగంగానే ట్విట్టర్లో వారి ఫొటోలు పోస్ట్ చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకూ ట్విట్లర్లో పోస్ట్ లు చేస్తూ..  టీవీ9, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఇక ఈరోజు తాజగా పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమలో మహిళలకు అండగా నిలిచేందుకు సంచలన ప్రకటన చేశారు. "మనలని, మన తల్లులని, ఆడపడుచులని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి?.. వాళ్ళ టీవీలు ఎందుకు చూడాలి?.. జర్నలిజం విలువలతో ఉన్న చానెల్స్, పత్రికలు, సమదృష్టికోణంతో ఉండాలని అన్నారు. ఇంకా కాస్టింగ్ కౌచ్ పై కూడా స్పందించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరుపున త్వరలోనే ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పడుతోందని దీనికి జనసేన పార్టీ "వీర మహిళా" విభాగం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. మరి ముందు ముందు ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూరో.. చూద్దాం..