పవన్ కు లీగల్ నోటీసులు...ఆల్ ద బెస్ట్

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్ట్ గానే మీడియాపై యుద్దం ప్రకటించేశారు. అంతేకాదు కొంత మంది పేర్లు కూడా బయటపెట్టారు. ఆ పేర్లలో ఓ మీడియా సంస్థ యజమాని శ్రీని రాజు పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పవన్‌కల్యాణ్‌కు శ్రీని రాజు నోటీసులు పంపారు.  తనను ఉద్దేశించి ట్విటర్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ..  పవన్‌ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, అసత్యాలని ఆరోపించారు. ఈ నేపథ్యంలో శ్రీనిరాజు తన తరఫు న్యాయవాది నుంచి పవన్‌కు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా శ్రీని రాజు తరపు న్యాయవాది మాట్లాడుతూ.... పవన్‌ తనపై ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలు తెలిసి శ్రీనిరాజు షాక్‌ అయ్యారని.. నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే.. మిగిలిన రాజకీయ నాయకులకూ పవన్‌కు తేడా ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు... శ్రీనిరాజుకు ప్రత్యక్షంగానూ, పరోక్ష్యంగానూ చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో ఎటువంటి బంధం లేదని.. వర్మ, రవి ప్రకాశ్‌తో కలిసి శ్రీనిరాజు టీడీపీ నేతలకు సాయం చేస్తూ.. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సహకరించారని చెప్పడం కేవలం ఊహాజనితమేనని తన క్లయింట్‌ అన్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ప్రజలు తనపై ఆరోపణలు చేసినప్పుడు పవన్ ఎంత బాధపడ్డారో.. ఇప్పుడు పవన్ చేసిన ఈ నిరాధార వ్యాఖ్యలకు తన క్లయింట్‌ కూడా అంతే బాధపడ్డారని చెప్పారు.

 

ఇక దీనిపై పవన్ కూడా స్పందించి రాజుగారికి కౌంటర్ ఇచ్చారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించినా ఉపయోగం ఏం లేదని అన్నారు. అంతేకాదు.. సంబంధం లేని విషయాల్లోకి తనను లాగి, తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక ఉన్న నిజమైన ‘అజ్ఞాతవాసి’ ఎవరో తెలుసా? అంటూ  ట్వీట్ చేసిన పవన్ దానికి సమాధానం కూడా ఇచ్చారు. నిజమైన ‘అజ్ఞాతవాసి’ టీవీ 9 చానెల్ సీఈఓ రవిప్రకాష్ అని టీవీ 9 చానెల్ తమ రాజకీయ బాసులతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపిందని, రవిప్రకాష్ మార్గదర్శకత్వంలో తన తల్లిని చెప్పరాని మాటలతో పదే పదే తిట్టించారని అన్నారు.  శ్రీ సిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కైన రవి ప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించడమేంటని శ్రీనిరాజుని ప్రశ్నించారు. మరి ప్రస్తుతం దుమారం రేపుతున్న ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూద్దాం..