ఆమరణ నిరాహార దీక్షకు సిద్దం.. ఆ జిల్లా నుండే..!

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒకపక్క టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీరుపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. అయితే ఇంతవరకూ అవిశ్వాస తీర్మానం చర్చకు రాలేదనుకోండి. సభలు వాయిదా పడటం తప్ప... అవిశ్వాస తీర్మానం పై చర్చకు వచ్చే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలు సైతం అవిశ్వాస తీర్మానం పై చర్చ జరపాలని పట్టుపడుతున్నా అది మాత్రం వర్కవుట్ కావట్లేదు.

 

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పోరాటానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీలతో బంధానికి గుడ్‌బై చెప్పేసిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాలకెత్తుకోవాలని భావిస్తున్నారట. దీనికోసం సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తాలతో జిల్లాలవారీ పర్యటనలు చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే అనంతపురం, ఒంగోలు, కాకినాడ, వైజాగ్‌లలో సభలు పెట్టి ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి వచ్చే లాభాలను వివరించాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక జిల్లాల పర్యటన ముగిసిన వెంటనే రాయలసీమలోని అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ పవన్‌కళ్యాణ్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హోదా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలంటే ఆమరణ దీక్ష బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందనే భావనతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు.. ఎలాగూ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి... అనంతపురం నుంచే ప్రత్యేక హోదా ఎజెండాతో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నారట.

 

మొత్తానికి పవన్ కళ్యాణ్ మంచి ప్లానే వేసినట్టు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రత్యేక హోదా సాధనలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని పవన్  విమర్శిస్తూనే ఉన్నారు. దానికి తోడు కేంద్రం తీరు కూడా అలానే ఉంది. ఎలాగూ పవన్ కు బీజేపీ కి మధ్య లోపాయికార ఒప్పందం ఉందన్న వార్తలు వస్తున్నాయి కాబట్టి.. ఒకవేళ పవన్ దీక్ష చేపట్టి... దానికి కేంద్రం ఒప్పుకొని హోదా ఇస్తే క్రెడిట్ మొత్తం పవన్ కే వెళుతుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే పవన్ దీక్ష వరకూ ఆగాల్సిందే.