వైసీపీ-టీడీపీ కుమ్మక్కు... ఇదేం కామెడీ పవన్....

 

మొత్తానికి పవన్ కు రాజకీయం బాగానే వంటపట్టినట్టు ఉంది. పక్కవారిని విమర్శిస్తేనే కానీ.. రాజకీయ ఎదుగుదల ఉండదని తెలిసినట్టుంది. అందుకే ఇన్ని రోజులు నేను ఎవరిని విమర్శించను అని మడి కట్టుకొని కూర్చున్న పవన్.. ఇప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏపీ ప్రభుత్వం పై, టీడీపీపై, వైసీపీ పై విమర్శలు గుప్పించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే టీడీపీపై యూటర్న్ తీసుకొని.. ఆ పార్టీపై పవన్ ఓ రేంజ్లో విమర్శలు గుప్పించి అందరికీ షాకిచ్చాడు. జనసేన పార్టీ ఆవిర్బావం రోజున తమ పార్టీ కార్యచరణ ఏంటో... పవన్ ఏం నిర్ణయం తీసుకుంటాడో అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న వేళ.. టీడీపీని మెయిన్ టార్గెట్ గా చేసుకొని ఎవరూ ఊహించని విధంగా ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ నాలుగేళ్లలో టీడీపీపై కాస్త సాఫ్ట్ కార్నర్ తో పెద్దగా విమర్శించింది లేదు.. అందుకే పవన్ వెనుక చంద్రబాబు ఉన్నాడు అని ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేసేవారు. అలాంటిది సడెన్ గా టీడీపీపై విమర్శలు చేయడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక పవన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ.. పవన్ వెనుక బీజేపీ ఉందని మొదలుపెట్టారు. దీంతో మరోసారి పవన్ టీడీపీపై వారిపై విరుచుకుపడ్డారు.

 

మొన్నటి వరకూ తనను టీడీపీ మనిషని అన్నారు... ఇప్పుడేమో బీజేపీ మనిషని అంటున్నారు, బొక్కలు, లొసుగులు ఉన్న టీడీపీ వారు కేంద్రానికి భయపడతారేమో తప్ప, తాను ఎవరికీ భయపడబోనని, తలొగ్గనని మండిపడ్డారు. ఇక ఆరోజు నుండి టీడీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా అవిశ్వాస తీర్మానంపై విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. అదేంటంటే.. టీడీపీ, వైసీపీ పార్టీలు కుమ్మక్కయ్యాయని.. విచిత్రంగా ఉంది కదా...గతంలో ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవనే రెండు పార్టీలకు సవాల్ విసిరారు. దమ్ము ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించండి.. దానికి అవసరమైన 50 కాదు కదా.. 70మంది సభ్యుల మద్దతు నేను సేకరిస్తా.. వామపక్షాలు, తెరాస, కాంగ్రెస్ అందరి మద్దతు నేను తీసుకువస్తా.. మీరు దమ్ముంటే తీర్మానం పెట్టండి చాలు అని అన్నారు. ఇక పవన్ సవాల్ ను మొదట జగన్ స్వీకరించి...తాము అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు. అయితే అప్పుడు.. నేను మద్దతు సమీకరిస్తాను గానీ..  4వ తేదీలోగా తీర్మానం పెట్టాలి.. అని కండిషన్ పెట్టారు. కానీ మారుతున్న రాజకీయాల నేపథ్యంలో జగన్ 23 న కాకుండా ముందుగానే అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇక టీడీపీ కూడా వైసీపీకి మద్దతిచ్చేది ఏంటీ అని వారే స్వయంగా తీర్మానం పెట్టారు. ఇప్పుడు ఇదే పవన్ కు తప్పుగా కనిపిస్తోంది. ఇంకా కామెడీ ఏంటంటే... ‘‘తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండూ కుమ్మక్కు అయ్యాయి.. కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నారు’’ అంటూ పవన్ కల్యాణ్ సెలవివ్వడం. దీంతో ఇన్ని రోజులు మాట్లాడిన పవనేనా ఇప్పుడు ఇలా మాట్లాడుతుందని జనాలు అనుకుంటున్నారు. పవనే స్వయంగా మద్దతు సమీరించాల్సింది పోయి.. ఇలా మాట్లాడటం విచిత్రంగా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో ప్రత్యేకహోదా గురించి పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనలన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలేనా...? అని ప్రజలు విస్తుపోతున్నారు. అంతేకాదు... నవతరం రాజకీయాలు చేయాలని వస్తున్న పవన్ కల్యాణ్ కు.. ఇలాంటి రాజకీయాలు అవసరమా అని మాట్లాడుకునేవాళ్లు కూడా ఉన్నారు. మరి పవన్ ఆలోచన ఏంటో.. ఆయనకే తెలియాలి....