పవన్ ఇలా చేస్తే మోడీ దిగిరావాల్సిందే..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలన్నీ అవిశ్వాస తీర్మానం చుట్టూనే తిరుగుతున్నాయి. మీరు పెట్టండి అంటే కాదు మీరే పెట్టండి అంటూ అవిశ్వాసం బంతిని పక్క పార్టీ కోర్టుల్లోకి నెడుతున్నారు పార్టీల అధినేతలు. అవిశ్వాసానికి మీరు మద్దతిస్తారా అంటూ వైసీపీ అధినేత జగన్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్..ముందు మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టండి.. కావాలంటే ఇతర పార్టీలను నేను ఒప్పిస్తానంటూ జనసేనాని మీడియా సాక్షిగా ఆన్సర్ ఇచ్చారు. అయితే అవిశ్వాసం వల్ల మోడీకి చీమ కుట్టినట్లు కూడా ఉండదని.. దీని వల్ల సభలో చర్చ జరిగి బీజేపీ మీద ఉన్న మంటను అన్ని పార్టీలు పార్లమెంట్ సాక్షిగా తీర్చుకుంటే మాత్రం.. మోడీ ఆగ్రహానికి గురికావాల్సిందే తప్ప రాష్ట్రానికి ప్రయోజనం అన్నది శూన్యమేనన్నది విశ్లేషకుల మాట.

 

అయితే పవన్ ఇలా చేయాలి.. అలా చేస్తే ఉపయోగం ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కొన్ని ఐడియాలను ఇస్తున్నారు. హైదరాబాద్‌లో కూర్చొని ప్రెస్‌మీట్లు పెట్టకుండా ఏపీ రోడ్ల మీదకు పవన్‌ రావాలని కోరుతున్నారు. రాష్ట్రప్రజలకు ఇబ్బంది కలగకుండా... ఏపీ మీదుగా దక్షిణాదిని, ఉత్తరాదిని కనెక్ట్ చేసే రవాణా వ్యవస్థను స్తంభింపజేసి.. ఆంధ్రుల ఆవేదనను జాతీయ స్థాయిలో తెలియజేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ లాంటి ప్రజాకర్షణ ఉన్న వ్యక్తి పిలుపునిస్తే.. లక్షల్లో జనం తరలివస్తారు. వారి అండతో ప్రభుత్వ ఆస్తులకు ఏ మాత్రం నష్టం కలగని రీతిలో.. శాంతియుత పద్దతుల్లో రోడ్లు, రైల్వే వ్యవస్థను స్తంభింపజేస్తే.. ఈ నిరసన సెగ ఇతర రాష్ట్రాలను తాకుతుంది. మన ఆవేదనకు.. ఆందోళనలకు ఎలాంటి విలువ ఇవ్వకపోయినా.. కనీసం పక్క రాష్ట్రప్రభుత్వాల మాటనైనా కేంద్రప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటుందని పలువురు వాదిస్తున్నారు.

 

మార్చి 5 నుంచి ఆంధ్రా-ఒడిషా, ఆంధ్రా-తెలంగాణ, ఆంధ్రా-తమిళనాడు, ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లోని.. కీలక ప్రాంతాల్లో రహదారుల దిగ్భంధనం, రైల్‌రోకోలు చేయాలని పవన్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో తమ డిమాండ్ల సాధనం కోసం అక్కడి వారు ఇలాంటి పద్దతుల్నే పాటించారు.. పటేల్, జాట్ రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొన్న ప్రజలు రోజుల తరబడి రహదారుల మీద.. రైల్లే ట్రాకుల మీదే గడపడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగి.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దిగి రాక తప్పలేదు. మరి పవన్ అభిమానుల మాటను పట్టించుకుంటాడా లేక హైదరాబాద్‌లో ఉండే ప్రెస్‌మీట్లు, ట్వీట్‌లతో కాలక్షేపం చేస్తాడా అనేది వేచి చూడాలి.