ఏపీ కోసం పవన్ నిరాహార దీక్ష..?

విభజన హామీలను గాలికొదిలేసింది గాక.. బడ్జెట్‌లో సంతృప్తికరమైన కేటాయింపులు లేకపోవడంతో బీజేపీపై ఆంధ్రప్రదేశ్ భగ్గుమంటోంది. తమకు న్యాయం చేయాలంటూ గత కొద్దిరోజులుగా ఏపీ ఎంపీలు పార్లమెంటు ఉభయసభలను స్తంభింపచేస్తున్నారు. ప్రధాని దిగి వచ్చి స్పష్టమైన హామీ చేస్తారనుకుంటే.. నిన్నటి ఆయన ప్రసంగం "ఆ ఒక్కటి తప్ప" అన్నట్లుగా సాగింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు నష్టం కలిగితే ఏ మాత్రం సహించేది లేదు అంటూ పెద్ద పెద్ద మాటలు డైలాగ్స్ కొట్టే.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వారం తర్వాత తీరిగ్గా నిన్న ప్రెస్‌మీట్ పెట్టారు.

అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారని.. కేంద్రప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. తాను ప్రశ్నించాలని కాకినాడలో సభ పెడితే నన్ను కూల్ చేశారని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి మేలు చేసే డిమాండ్ల సాధనపై చేసే పోరాటానికి తన ఒక్కడి బలం సరిపోవడం లేదని.. ఉండవల్లి అరుణ్‌కుమార్, జయప్రకాశ్ నారాయణ్ లాంటి మేధావులను కలుపుకుని జాయింట్ యాక్షన్ కమిటీగా ముందుకు వెళ్తానని చెప్పారు.

సినిమాలకు దూరమై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా అడుగులు వేస్తోన్న పవన్.. నిన్న మొన్నటి వరకు రెండు రాష్ట్రాల్లో బస్సు యాత్రలు చేశారు. మరో విడత యాత్రకు సన్నద్ధమవుతున్న దశలో.. ఆయనకు బడ్జెట్‌‌లో కేంద్ర ప్రభుత్వ తీరు ఒక అస్త్రంగా దొరికింది. దీనిపై అటెన్ష‌నైన జనసేనాని.. బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ‌ఆందోళన నిర్వహించాలని పవన్ భావిస్తున్నారు. కుదిరితే నిరాహారదీక్ష కూడా చేస్తారని జనసేన కాంపౌండ్‌లో టాక నడుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఆలోచన ఎలా ఉండబోతుందా అన్న దానిపై.. త్వరలోనే స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.