TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కు ఫ్యాన్స్ వల్లే నష్టమా.. ఒకసారి ఆలోచించండి..

Published on: Sat Dec 16, 2017 2:02PM

 

రాజకీయాలు అంటే ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీపై విమర్శలు గుప్పించడం.. లేదా..ఒకపార్టీపై మరొక పార్టీ విమర్శలు గుప్పించడం ఉండేది. అదంతా ఒకప్పుడు ఇప్పుడు కాలంతో పాటు రాజకీయాల్లో మార్పులు వచ్చాయి.. మాటల్లో కూడా మార్పులు వచ్చాయి. విమర్శల స్థానంలో తిట్లు చేరాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం మరిచిపోయి.. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా తిట్టుకొనే స్థాయికి చేరాయి. తాజాగా ఈ పరిస్థితి మరీ గోరంగా తయారైంది.

 

పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ గత కొంత కాలంగా కత్తి మహేష్ చేస్తున్న ఎదురుదాడి చుట్టూ ప్రస్తుతం బూతు రాజకీయం నడుస్తుంది. తానొక ఫిలిం క్రిటిక్ అని చెప్పుకునే కత్తి మహేశ్ ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించారో... ఓ రకంగా అప్పటినుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కత్తి మహేశ్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి గట్టారు. ఒక పక్క కత్తి మహేశ్.. మరోపక్క పవన్ ప్యాన్స్ యే రచ్చ రచ్చ చేస్తుంటే.. వీరికి తోడు రోజా లాంటి వాళ్లు వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా.. చంద్రబాబుపై ఎన్నో కామెంట్లు చేసిన రోజాకి.. మిగిలిన వాళ్లు అంటే లెక్కేముంది. ఏది నోటికి వస్తే అది మాట్లాడుతుంది. అందుకే లైవ్ ప్రోగ్రాంలో బండ్ల రోజా మధ్య జరిగిన సంభాషణ అందరిని సిగ్గుపడేలా చేసింది.

 

మరోవైపు విమర్శలను అస్సలు తట్టుకోలేని జనసేన పార్టీ అభిమానుల్లో కొంతమంది రోజా, కత్తి మహేష్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇక తాను  ఏ పార్టీకు చెందను అని చెప్పుకుంటూ వైకాపాకు సపోర్ట్ చేస్తున్న కత్తి మహేష్, రోజా వారిని ఉడికించి ఇరికిస్తున్నారు. రోజా, కత్తి మహేష్ లను ఎదురుకోవడంలో ఒకరకంగా జనసేన ఇబ్బంది పడుతుందనే చెప్పుకోవాలి. వారు సైలెంట్ గా విమర్శలు చేస్తూ రెచ్చగొడుతుంటే.. పవన్ అభిమానులు రెచ్చిపోయి.. అందరి ముందు చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పవన్ ను ఏదైనా అంటే... ఫ్యాన్స్ ఊరుకోరు.. ఇప్పుడే ఇలా ఉంటే అధికారంలోకి వస్తే ఎలా అని మాట్లాడుకునే స్థాయికి వచ్చింది. పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ వల్ల అది ఇంకా తారాస్థాయికి చేరింది. దీంతో పవన్ అభిమానులు ఆయనకు లాభం చేకూర్చడం సంగతేమో కానీ... ఆయనకు నష్టం చేకూర్చడంలో మాత్రం పరోక్షపాత్ర పోషిస్తున్నారు. మరి అన్నీ గమనించుకొని.. ఆవేశపడకుండా.. ఆలోచించి ముందడుగు వేస్తేనే.. పవన్ కు మంచి జరుగుతుంది తప్పా... లేకపోతే ఎవరైతే తనకు కొండంత బలం అని పవన్ నమ్ముతున్నారో.. వారే పవన్ కు చెడ్డ పేరు తెచ్చినట్టువుతుంది. ఈ విషయంలో పవన్ అభిమానులు ఆలోచించుకోవాల్సిందే...