ఏపీ మంత్రులకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదట

తెలుగుదేశం పార్టీకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మధ్య ఉన్న బంధం గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారు. పాలించడానికి కాదు..ప్రశ్నించడం కోసమంటూ జనసేన పార్టీని స్థాపించినా.. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనుభవజ్ఞుడైన చంద్రబాబు వల్లే అవుతుందని.. తాను ఎన్నికల్లో పోటీ చేసి ఆయనను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదని ప్రకటించి.. టీడీపీకి సంపూర్ణ మద్ధతు తెలిపారు.. అంతేకాకుండా ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి తెలుగుదేశం విజయంలో ఒక చేయి వేశారు పవన్. అందువల్ల ఆయనంటే టీడీపీ కార్యకర్తలకు, నేతలకు ఎనలేని గౌరవం.

 

 

తన తరపున ఎన్నో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేశారు పవర్‌స్టార్. టీడీపీ నేతలు కూడా పవన్ మాటకు విలువనిచ్చి వాటిని పరిష్కరించారు. అయితే ప్రతి విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించే పవన్.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, మంత్రి పితాని సత్యానారయణల పేర్లను ప్రస్తావిస్తూ కళ్యాణ్ ట్వీట్ చేశారు. "అశోక్ గజపతిరాజు గారికి పవన్‌ కళ్యాణ్ ఎవరో తెలియదు.. మంత్రి పితాని గారికి పవన్ కళ్యాణ్ ఏంటో తెలియదు.. సంతోషం" అని ట్వీట్ చేశారు. జనసేనానికి వీరిమధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. పార్టీ పెట్టిన నాటి నుంచి టీడీపీ నేతలపై ఎప్పుడు ఈ స్థాయిలో అసహనం ప్రదర్శించలేదు. దీనిపై తెలుగుదేశం వర్గాలు స్పందించాల్సి ఉంది.