వైసీపీ, టీడీపీలకు పవన్ స్ట్రోక్..!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలకు అత్యంత కీలకంగా మారిన నంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం రెండు పార్టీలు తీవ్ర స్థాయిలో వ్యూహాలు రెడీ చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా చోటా మోటా నేతల నుంచి ఛరిష్మా ఉన్న నేతలను ప్రచారంలో దించాయి ఇరు పక్షాలు. ఈ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో జయాపజయాలను ప్రభావితం చేయగల సత్తా ఉన్న బలిజ సామాజిక వర్గం ఓట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి సామ, ధాన, బేధ, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు ఇరు పార్టీల అధినేతలు. ఈ క్రమంలో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ కీలకంగా మారారు. దీంతో ఆయన మద్ధతు పొందేందుకు ఎవరికి వారు రాయబారాలు నడుపుతున్నారు.

 

2014 ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి ఆ పార్టీ అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేసి వారి విజయానికి పవన్ కారణమయ్యారని చాలా మంది బాహాటంగానే చెబుతారు. మిత్రపక్షంగా ఉన్న కారణంగా జనసేనాని మద్దతు తమకేనని టీడీపీ నేతలు భావిస్తూ వచ్చారు. అలాగే భూమా కుటుంబం ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పుడు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డితో కలిసి పనిచేశారు పవన్. ఆ రకంగా భూమా ఫ్యామిలీతో పవర్‌స్టార్‌కు మంచి అనుబంధమే ఉంది. పైగా ఉద్దానం కిడ్నీ బాధితులు, ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సున్నితంగా విమర్శించారే తప్ప మిత్రపక్షం నుంచి బయటకు రాలేదు. అంతేందుకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమానికి తొలిసారి హాజరైన పవన్..చంద్రబాబుతో ముచ్చటించడం..ఈ పరిణామాలన్నింటిని బేరీజు వేసుకున్న సైకిల్ పార్టీ నేతలు పవన్ తమవైపే ఉంటారని భావించారు.

 

అయితే చంద్రబాబు వ్యవహారశైలి పవన్‌కు నచ్చడం లేదని..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం విమర్శించారన్న కోపం జనసేనానిలో ఉందని అందువల్ల ఆయన ఈసారి తమకే మద్దతు ప్రకటిస్తారని భావించింది వైసీపీ అధినాయకత్వం. అలా ఎవరికి వారు..తమ లెక్కల్లో తాము ఉండగానే అదిరిపోయే స్ట్రోక్ ఇచ్చారు జనసేన అధినేత. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో తమ పార్టీ తటస్థంగా ఉంటుందని ప్రకటించారు. తాను గానీ, జనసేన పార్టీగానీ ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు 2019 వరకు ఎలాంటి ఉప ఎన్నిక వచ్చినా ఇదే విధానాన్ని అనుసరిస్తామన్నారు పవన్.

 

క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికలకు వెళతామని, అప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం గానీ...ఏ పార్టీకి గానీ..ఏ అభ్యర్థికి గానీ మద్దతు ఇచ్చేది ఉండదని స్పష్టం చేయడంతో రెండు పార్టీల నేతలకు వర్షాకాలంలో కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. పవన్‌ను ప్రచారంలోకి తీసుకురావడానికి మంత్రి భూమా అఖిలప్రియ చివరి క్షణం వరకు ఎంతో ప్రయత్నించారు. కానీ కాటమరాయుడు ఇలా ఊహించని షాక్ ఇచ్చేసరికి అఖిల ప్రియ కాస్త నిరాశకు లోనయ్యారట. ఆవిడ ఒక్కరే కాదు ఇప్పుడు టీడీపీ, వైసీపీ నేతల పరిస్థితి అలాగే ఉందట. మరి పవన్ ఈ తటస్థ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో..ఆయనకే తెలియాలి.