TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్‌ హటావో... దేశ్ బచావో అన్న నోటితోనే జైకొట్టడమేంటి?

Published on: Mon Jun 5, 2017 2:43PM

 

ఏపీలో స్పెషల్ స్టేటస్ ఫైట్ మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ-టీడీపీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పార్టీలకు మద్దతుగా పరిణామాలు మారుతున్నాయి. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా తమ యువనేత రాహుల్ గాంధీతో సమరశంఖం పూరించిన కాంగ్రెస్ కు జనసేనాని మద్దతివ్వడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గుంటూరులో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో మద్దతు తెలిపారు. అంతేకాదు... స్పెషల్ స్టేటస్ సాధించేందుకు అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని కూడా సూచించారు.

 

సభకు రావాలని కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందినా సమయాభావంతో రాలేకపోతున్నానన్న పవన్... బహిరంగ సభల ద్వారానే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని ట్వీట్ చేశారు. అయితే... ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని నీతి అయోగ్ తాజాగా ప్రకటించేసింది. సీఎం చంద్రబాబు కూడా దానిపై ఆశలు వదిలేసి ప్రత్యేక ప్యాకేజీతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇంతకాలం ఆయనకు మిత్రపక్షంగా కొనసాగిన పవన్... ఇలా కాంగ్రెస్ పోరాటానికి మద్దతు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

 

కాంగ్రెస్ సభకు పవన్ మద్దతివ్వడమంటే అధికార పార్టీకి ఝలక్ తగిలినట్లేనని కొందరు విశ్లేషిస్తుంటే... ప్రత్యేక హోదా కోసమే ఎన్నికల బరిలోకి దిగుతానన్న పవన్ కల్యాణ్.. ఇలా మరో పార్టీకి మద్దతివ్వడమే కాకుండా.. అందరూ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునివ్వడమేంటని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ తాజా ట్వీట్స్‌పై హాట్‌హాట్‌గా చర్చ నడుస్తోంది. స్పెషల్ స్టేటస్ కోసం రాహుల్ ను రాష్ట్రానికి రప్పించిన కాంగ్రెస్ పార్టీపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. జనసేనాని మాత్రం జై కొట్టడం వెనక ఆంతర్యమేంటని అంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్‌ హటావో... దేశ్ బచావో అన్న నోటితోనే మూడేళ్లు తిరగకుండానే కాంగ్రెస్‌కు జైకొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.