బీజేపీపై ఫైరవుతున్న పవన్‌... టీడీపీతో జత కడతారా? లేదా?

 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కి సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తా లేకపోయినా... ప్రధాన పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగల స్టామినా అయితే కచ్చితంగా ఉంది. ఇది 2014 ఎన్నికల్లో రుజువైంది కూడా, ఎన్నికలకు మూడ్నెళ్ల ముందువరకూ వైసీపీదే విజయమన్న సర్వేల అంచనాలన్నీ పవన్‌ రాకతో తారుమారయ్యాయి. తానే ముఖ్యమంత్రినంటూ కలలగన్న జగన్‌ ఆశలన్నీ తలకిందులయ్యాయి. కేవలం 1.2 పర్సంటేజ్‌ తేడాతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అందుకు పవన్‌ కల్యాణే కారణమనేది రాజకీయ పండితుల విశ్లేషణ. పలువురు టీడీపీ నేతల మాట కూడా ఇదే.

 

అయితే 2014లో బీజేపీకి, టీడీపీకి మద్దతిచ్చిన పవన్‌ కల్యాణ్‌... 2019లో జనసేనను ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. అందుకు గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేపడుతున్నారు. అయితే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే... కచ్చితంగా తెలుగుదేశానికి నష్టమే. కనీసం 50 నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారవడం ఖాయం. అదే జరిగితే ప్రతిపక్ష వైసీపీ భారీగా లాభపడతుంది. అయితే టీడీపీకి జనసేనతో పొత్తు ఎంత ముఖ్యమో... బీజేపీతో మైత్రి కూడా అంతే ముఖ్యం. కానీ ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిందంటూ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్‌ కల్యాణ్‌.... టీడీపీ-బీజేపీ కూటమితో చేతులు కలుపుతారా అనేది ప్రశ్నార్ధకమే.

 

అయితే పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల ఇంటర్నల్‌ టాక్స్‌ ప్రకారం తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని, ఈలోపు సమీకరణాలు మారతాయంటున్నారు. జగన్‌‌ను వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించే పవన్‌... కచ్చితంగా తమతోనే కలిసి నడుస్తారని అంటున్నారు. ఏదిఏమైనా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయడం మాత్రం ఖాయమంటున్నారు టీడీపీ నేతలు.