ఉత్తరాది మీదకి వీస్తున్న దక్షిణాది ఉగ్ర పవనం!


మన సమాజంలో ఎందరో మేధావులు వుంటారు. ఒక్కో రంగంలో నిష్ణాతులైన వారు కూడా వుంటారు. వారందర్నీ వదిలేసి ఏదైనా చెప్పించాల్సి వస్తే ప్రభుత్వాలు సినిమా హీరోల దగ్గరికి పరుగుతీస్తాయి. ఎందుకని? సిగరెట్ కాల్చొద్దని చెప్పాలన్నా, స్వచ్ఛ్ భారత్ కోసం పాటుపడమని చెప్పాలన్నా... ఇలా ఏ పిలుపునివ్వాలన్నా సినిమా వాళ్లే కావాలి. కారణం వాళ్లకు జనంలో వుండే ఫాలోయింగ్! ఇక కమర్షియల్ యాడ్స్ సంగతైతే సరే సరి. సినిమా హీరోస్, హీరోయిన్స్ కి కోట్లు గుమ్మరించి తమ ప్రకటనలు చేయించుకుంటాయి కంపెనీలు. జనం మీద సినిమా వాళ్ల ప్రభావం అంతగా వుంటుంది...


తెలుగు సినిమా సెలబ్రిటీల విషయానికొస్తే పవన్ ఖచ్చితంగా బోలెడు ఫాలోయింగ్ వున్న నటుడు. పవర్ స్టార్ పవర్ మనకు తెలియంది కాదు. అందుకే, గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపి పవన్ మద్దతు కోరి గట్టెక్కాయి. ఆయన సాయం కూడా చంద్రబాబు, మోదీ జంటకి కలిసొచ్చిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కాని, రెండు వైపుల పదునైన కత్తి లాంటి తన ఇమేజ్ ని, ఫాలోయింగ్ ని పవన్ కేర్ ఫుల్ గానే వాడుతున్నాడా? మరీ ముఖ్యంగా, ప్రత్యేక హోదా విషయంలో ఆయన స్పీచ్ లు, మాటలు, ట్వీట్స్ కొన్ని సార్లు ఆందోళనకరంగా వుంటున్నాయి... 


ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనటంలో ఎలాంటి సందేహం లేదు. దాని కోసం పోరాటం చేయటం కూడా సబబే. కాని, మొదట్నుంచీ హోదా కావాలని డిమాండ్ చేస్తోన్న పవన్ మాత్రం తాజాగా వైజాగ్ నిరసనలకు మద్దతు పలికాడు. అందులో భాగంగా ట్వీట్స్ చేస్తూ ఉత్తరాది, దక్షిణాది చర్చ తీసుకొచ్చాడు. జనవరి 26న మౌన పోరాటం తలపెట్టిన యువతకి పవన్ అండగా నిలిచాడు. కాని, హోదా ఇవ్వాల్సింది ఢిల్లీ ప్రభుత్వం కాబట్టి ఉత్తరాది నాయకుల్ని టార్గెట్ చేశాడు... 


మన దేశంలో ఇప్పటికే అనేక విబేదాలు, విద్వేషాలు వున్న మాట నిజం. మతం, కులం, ప్రాంతం, భాష వంటి అనేక కారణాలతో నిత్యం కొట్టుకు ఛస్తుంటారు భారతీయులు. వీటికి తోడు ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాది భేదం తీసుకురావటం ఎందుకు అంటున్నారు కొందరు విమర్శకులు. హోదా ఇస్తామని ఇవ్వకపోవటం మోదీ సర్కార్ తప్పిదమే. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నిజంగా లేనే లేనటువంటి ఉత్తరాది, దక్షిణాది ఫీలింగ్ ని జనాల్లో సృష్టించటం అనవసరం అంటున్నారు. అసలు ఢిల్లీ ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాలకే కాదు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చిందేం లేదు. నీతి ఆయోగ్ వచ్చాక దేశంలో ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వటం అంటూ జరగదని చెబుతున్నారు. అయినా కూడా ఈ విషయంలో పవన్ ఉత్తరాది నాయకులు దక్షిణాదిని చులకనగా చూస్తున్నారని అనటం, పెద్దగా లాజికల్ కాదు...


అప్పట్లో హిందీ వ్యతిరేక ఉద్యమాలు తమిళనాడులో జరగినప్పుడు ద్రవిడ, ఆర్య విభేదాలు పాటిస్తూ గొడవలు జరిగాయి. తరువాత క్రమక్రమంగా నార్త్, సౌత్ పీలింగ్ సమసిపోయింది. ఎక్కడో కొద్దిపాటి పక్షపాతం కొందరిలో వుందేమోగాని ఉత్తరాది నేతల వల్ల దక్షిణాది నష్టపోయేంత దారుణంగా మాత్రం పరిస్థితి లేదు.గ్లోబలైజేషన్ మొదలయ్యాక అయితే బోలెడు మంది తెలుగు వారు ఐటీ ఉద్యోగాల కోసం ఢిల్లీ, పూణే, ముంబై లాంటి నగరాల్లో మకాం వేశారు. ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బందులు వుండటం లేదు. అంతే కాదు, పవన్ మాదిరిగా ఉత్తరాది, దక్షిణాది అంటూ ఆరోపణలు చేయటం కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణల్లో మనకు కనిపించవు. మరి పవన్ ఎందుకు ఈ విధంగా కొ్త్త విభేదం సృష్టించేలా మాట్లాడుతున్నాడు? బహుశా ఆయనకి సలహా ఇస్తున్న వారేమైనా తప్పుడు మాటలు చెబుతండవచ్చు. 
 

భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న పవన్ మరీ ముఖ్యంగా యువతని దృష్టిలో పెట్టుకుని బాధ్యతయుతంగా మాట్లాడితే బావుంటుంది. ఆయన ఉద్దేశం ఏదైనా ఆంధ్రాలోని యూత్ కు నార్త్, సౌత్ విషయంలో లేనిపోని అపొహలు ఏర్పడితే అది దీర్ఘ కాలంలో మంచిది కాదు. పవర్ స్టార్ హోదాపైనే దృష్టి పెట్టి విమర్శలు చేస్తే బావుంటుందంటున్నారు విమర్శకులు...