అభిమానులను చూసి భయపడుతున్న పవన్..

 

పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎంతగా అభిమానిస్తారో.. ఎంతగా ప్రేమిస్తారో అందరికీ తెలిసిందే. ఆయన్ని ఏకంగా తమ దేవుడిగా కొలిచే అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఒక్కోసారి వారి అభిమానమే పవన్ ను ఇబ్బందికి గురిచేస్తుంటుంది. కొన్నిసార్లు ఆడియో ఫంక్షన్లు జరిగినప్పుడు పవన్ అభిమానులు చేసే గోల వల్ల వేరే హీరోలు ఇబ్బంది పడిన సందర్బాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి ఏకంగా పవనే వారి అభిమానానికి భయపడ్డారు. ప్రస్తుతం పవన్ ధర్మవరం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనకు స్వాగతం పలకాలన్న అభిమానుల అత్యుత్సాహం, వారి స్పీడ్ ను చూస్తుంటే తనకు చాలా భయంగా ఉందని అన్నారు. తాను సినిమా ఫంక్షన్స్ ఎక్కువగా జరుపుకోనని, అభిమానులు నలిగిపోవడం తనకు ఇష్టం లేకనే ఫంక్షన్స్ కు దూరంగా ఉంటానని..  కానీ, ప్రజా సమస్యలను గురించి తెలుసుకునేందుకు ప్రజల్లోకి రాక తప్పదని, దీనివల్ల అభిమానులు ఇబ్బందులకు గురి కావడం తనకు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.

 

అంతేకాదు అభిమానులు సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని, వారి తరువాతే అభిమాన హీరో అనుకోవాలని హితవు పలికారు. వేగంగా, అత్యుత్సాహంతో రావద్దని, సంతోషంగా, నెమ్మదిగా రావాలని పిలుపునిచ్చారు. ఎవరికి ఏమైనా ఓ అన్నగా తనకు బాధ కలుగుతుందని, తనకు ఎటువంటి వేదనను కలిగించవద్దని వేడుకుంటున్నానని చెప్పారు. కాగా పవన్ అనంత పర్యటనలో.. తన కాన్వాయ్ కింద పడి ఓ అభిమానికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే కదా.