నంద్యాల బైపోల్.. క్లారిటీ ఇచ్చేసిన పవన్..

 

నంద్యాల ఉపఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇస్తారా..? లేదా..? అని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఎదురుచూపులకి బ్రేక్ పడినట్టే. నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో పవన్ ను ఉపయోగించుకోవాలనుకున్న టీడీపీకి నిరాశే మిగిలింది. నంద్యాల ఉపఎన్నికల్లో తాము ఎవ్వరికీ మద్దతు ఇవ్వడంలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉపఎన్నిక నేపథ్యంలో పవన్ మద్దతు విషయంలో వస్తున్న వార్తలపై స్పందించిన పవన్... తమ పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, ఎవరికో తాము మద్దతు ఇస్తున్నట్టు వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. 2019 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికలకు వెళతామని, అప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ‘జనసేన’ మద్దతు ఉండదని స్పష్టం చేశారు. కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ టీడీపికి మద్దతుగా నిలిచి.. గెలుపులో కీలక పాత్ర పోషించిన సంగతి తెలసిందే. కానీ ఈ మూడేళ్లలో తెలుగుదేశం పార్టీ వైఖరిపై పవన్ పలు విమర్శలు గుప్పించిన సంగతి కూడా విదితమే. దీంతో పవన్ టీడీపీ కి మద్దతు ఇస్తారా అన్న అనుమానాలు తలెత్తాయి. ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది. మరి పవన్ నిర్ణయంపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం.