గల్లీకో మెగాస్టార్.. జిల్లాకో పవర్‌స్టార్!

 

 

 

తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్త. పొరపాటున తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మీ జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోతే పడిపోతాయేమోగానీ, మీకు మాత్రం సినిమా వినోదానికి ఎంతమాత్రం లోటుండదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేశాక తెలంగాణ బిడ్డల నుంచి గల్లీకో మెగాస్టార్, జిల్లాకో పవర్‌స్టార్ పుట్టుకొస్తారు మరి. ఈ లెక్క ప్రకారం తెలంగాణ సినిమా పరిశ్రమకు మొత్తం పదిమంది పవర్‌స్టార్లు దొరుకుతారు.

 

ఇక తెలంగాణలో మొత్తం ఎన్ని గల్లీలు ఉన్నాయో లెక్కేస్తే అంతమంది మెగాస్టార్లు మిమ్మల్ని ఆనందపరుస్తారు. ఈ శుభవార్తని చెబుతోందెవరో కాదు.. తెలంగాణ సినిమా కళాకారులు! ఇంతకీ అసలు జరిగిందేంటంటే, తెలంగాణ సినిమా కళాకారులు ఈమధ్య ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తెలుగు సినిమా పరిశ్రమను బాగా తిట్టిపోశారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల పిడికిళ్ళలో తెలుగు సినిమా రంగం నలిగిపోతోందని, వాళ్ళంతా తెలంగాణ బిడ్డల్ని సినిమా రంగంలో దారుణంగా తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు.



ఎనభయ్యేళ్ళ సినిమా రంగంలో తెలంగాణ నుంచి ఎనిమిది మంది హీరోలు కూడా రాలేదని వాపోయారు. రేపు తెలంగాణ వచ్చాక తెలుగు సినిమా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి తెలంగాణ బావుటా ఎగరేస్తామని డిసైడ్ చేశారు. తెలంగాణలో ఎన్నో వేలమంది ప్రతిభావంతులైన కళాకారులు సినిమా అవకాశాలు దొరక్క బాధపడుతున్నారని, తెలంగాణ వచ్చేస్తే వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు వస్తాయని అన్నారు. గల్లీకో మెగాస్టార్, జిల్లాకో పవర్‌స్టార్ పుట్టుకొస్తారని చెప్పారు.  ఇంకేం.. సీ అండ్ ఎంజాయ్!