పవన్ ట్వీట్స్... టీడీపీ అలర్ట్...

 

శ్రీరెడ్డి ఎపిసోడ్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని పొలిటికల్ డ్రామా తెరపైకి వచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ దగ్గర మొదలైన వ్యవహారం ఆఖరికి రాజకీయాల వరకూ వచ్చింది. శ్రీరెడ్డి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అసలు ఎక్కడ మొదలైంది... ఎక్కడివరకూ వెళ్లింది ఈ వ్యవహారం అని అందరూ ఒకటే చర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే పవన్ ను అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగారు అని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. పవన్ అభిమానులు, సినీ ప్రముఖులు సామాన్య ప్రజలు సైతం శ్రీరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనిపై చర్చలు జరుగుతుండగానే ఆడియో లీక్స్ ఒకటి బయటకు వచ్చాయి. దీని సూత్రధారి రామ్ గోపాల్ వర్మ అని బయటపడింది. అంతేకాదు దీని వెనుక వైసీపీ కుట్ర కూడా ఉందని బయటకు రావడంతో అసలు ఇష్య్చూ మొత్తం ఒక్కసారిగా రాజకీయాలవైపు మళ్లింది.

 

ఇక ఏ విషయంపైనా పెద్దగా స్పందించని పవన్ ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న మధ్యరాత్రి ట్విట్టర్ వేదికగా చాలా భావోద్వేగంగా కొన్ని ట్వీట్లు కూడా పెట్టారు. అయితే ఆ ట్వీట్లలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై, మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్. ‘నా తల్లిపై ప్రయోగించిన అభ్యంతరకర భాషని పదేపదే ప్రసారం చేసిన వార్తను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ లేదా ప్రతిపక్షనేతల తల్లిపై కూడా వాడి ఉంటే మీ మీడియా సంస్థలు ప్రసారం చేసే ధైర్యం చేసేవా?’ అని సూటిగా ప్రశ్నించారు. కేవలం పవన్ కల్యాణ్ తల్లి, ఎవరికీ, ఏనాడూ అపకారం తలపెట్టని పవన్ కల్యాణ్ తల్లిపై వాడిన అసభ్యకరమైన భాషను మాత్రం పదేపదే టెలీకాస్ట్ చేసి, దానిపై విశ్లేషణలు, చర్చలు చేపడతారు... అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు చెప్పండి శక్తిమంతమైన, ధనిక మీడియా శక్తులారా? పవన్ కల్యాణ్ కే ఈ ప్రత్యేకమైన ట్రీట్ మెంట్ ఎందుకు?’ అని ఆయన నిలదీశారు. అంతేకాదు దీనిపై ఆయన లీగల్ కూడా యాక్షన్ తీసుకోనున్నట్టు సమాచారం.

 

ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ ట్వీట్ వ్యాఖ్యలపై పార్టీ నేతలెవరూ స్పందించవద్దని టీడీపీ వారి నేతలకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ చంద్రబాబు ఈరోజు దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తే చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష పక్క దారిపడుతుందని...చంద్రబాబు దీక్షా సమయంలో ఈ తరహా రాజకీయాలకు తెరలేపడం కుట్రలో భాగమేనని టీడీపీ అధిష్టానం అభిప్రాయపడింది. శ్రీరెడ్డి ఎపిసోడ్‌ను రాజకీయాలకు ఆపాదించడంలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర ఉందని.. ఒక వేళ టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేస్తూ రంగంలోకి దిగితే చంద్రబాబు చేపట్టిన దీక్షకు తగిన ప్రాధాన్యత లభించకపోవచ్చనే టీడీపీ అధిష్టానం ఈ మేరకు అప్రమత్తంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మరి ముందు ముందు ఇంకెన్నిఈ వ్యవహారంలో ఇంకెన్ని ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయో... పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. దానికి టీడీపీ ఎలా స్పందిస్తుందో.. చూద్దాం..