పవన్, రజనీ.. ఆయన్ను ఫాలో అవ్వొచ్చు కదా!

’పవన్ కల్యాణ్ ఇక సినిమాలు చేయడు...‘ కోట్లాది మంది అభిమానులను నిరాశకు గురిచేసే మాట. 
’కమలహాసన్ ఇక నటించడు...‘ యావత్ భారతావనే బాధతో నిట్టూర్చే మాట. 
’సూపర్ స్టార్ రజనీకాంత్... ఇక తెరపై కనిపించడు...‘ దేశవ్యాప్త తలైవా ఫ్యాన్సును విషాదంలో ముంచెత్తే మాట. 

నిజానికి రాజకీయాల్లోకెళ్తే.. చేసే పనిని వదిలిపెట్టాలా? అలా అయితే... ఎన్టీయార్ ‘నా దేశం’ సినిమా చేసేవారు కాదే. అలా అయితే... ఎన్టీయార్ నుంచి ‘శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర’ సినిమా వచ్చేది కాదే. రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలు చేయకూడదనేం రూల్ లేదు. అలాంటి రూలే ఉంటే... ముఖ్యమంత్రిగా ఉంటూనే  ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ఎందుకు చేస్తాడు ఎన్టీయార్? ఓ వైపు ప్రతి పక్షనేతగా ఉంటూ.. మరో వైపు ఏకంగా సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్, శ్రీనాధ కవిసార్వభౌమ చిత్రాల్లో ఎందుకు నటిస్తారు? 

 

ఎన్టీయార్ రాజకీయాల్లో ప్రవేశించిన కొత్తలో.. ప్రచారంలో ఉండగా చేసిన సినిమా ‘నాదేశం’. అప్పటి రాష్ట్ర పరిస్థితులను, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రశ్నిస్తూ చేసిన సినిమా అది. దానికి జనాలు బ్రహ్మరథం పట్టారు. రాజకీయ పరంగా కూడా ఆయనకు ఆ సినిమా ఉపయోగపడింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పవర్ స్టార్ చివరి సినిమా అని చెప్పుకుంటున్న ‘అజ్ఙాతవాసి’... ఆయన ఇమేజ్ ను డామేజ్ చేసింది. రజనీకాంత్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు తెరపై కనిపించబోయే సినిమాలు... రోబో2, కాలా.. ఇవి సమకాలీన సమస్యల్ని ఎత్తి చూపే సినిమాలు కావు. మామూలు కమర్షియల్ సినిమాలు. కమల్ విశ్వరూపం 2, భారతీయుడు 2 సినిమాలు చేస్తానంటున్నాడు  

 

అసలు ఈ సూపర్ స్టార్లు ముగ్గురూ ఎన్టీయార్ ని ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదు? సామాజికాంశాలు మేళవించిన కథలను ఎంచుకొని... జనాల్లో చైతన్య దీపికలను వెలిగిస్తూ... ఓ వైపు నటులుగా.. మరో వైపు నాయకులుగా ఎందుకు ముందుకెళ్ల కూడదు? చేతిలో ఉన్న బలమైన ఆయుధమైన సినిమాను ఉపయోగించుకోవడం చాతకాని వీరు.. రేపు రాజకీయాలేం చేస్తారని చాలామంది అనుకుంటున్నారు. 

 

సూపర్ స్టార్, వపర్ స్టార్ల రాజకీయ జీవితాలకు ఉపయోగపడే సినిమాలను తెరకెక్కించే దర్శకులు కానీ.. రచయితలు కానీ ఇప్పుడు లేరా? అనే అనుమానాలను కూడా జనాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీయార్ ‘నా దేశం’ స్థాయి సినిమాను తీసే దర్శక, రచయితలు నేడుంటే... దేశ రాజకీయ చిత్రాన్ని.. వెండితెర సాక్షిగా ఎండగట్టే సినిమాలు వీరిద్దరి నుంచి వస్తే... దేశ రాజకీయాల్లో వేడి మొదలవ్వడం ఖాయం. జనాల్లో కొత్త కదలక రావడం ఖాయం. దక్షిణాది సినిమాల్లో కూడా ఓ కొత్త ట్రెండ్ మొదలవ్వడం ఖాయం.  ఏమంటారు ఫ్రెండ్స్.