పవన్ సాబ్.. పూలే కాదు.. చెప్పుదెబ్బలు ఉంటాయ్

 

సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చలోరే చల్ యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా నల్లేరుపై నడకలా సాగిపోతోంది. తెలంగాణవాదుల నుంచి కానీ.. టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ.. లేక మరొకరి నుంచో ఆయనకు ఎలాంటి వ్యతిరేకత రావడం లేదు. పవన్ అభిమానులు, పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న వేళ జనసేనానిపై చెప్పుల దాడి జరగింది. ఖమ్మం పర్యటనలో ఉన్న పవన్‌కళ్యాణ్ ఓపెన్‌టాప్ వెహికల్‌లో అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీగా తల్లాడ సెంటర్‌ వద్దకు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు పవన్‌ని చూసేందుకు భారీగా గుమిగూడారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పవన్‌ పైకి చెప్పు విసిరాడు. అయితే అది కారు బ్యానెట్‌పై పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన హీరోపై చెప్పు పడటంతో అక్కడున్న పవన్ ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయారు.

 

ఇది జరిగిన కాసేపటికీ కార్యకర్తలతో మాట్లాడిన పవన్.. నాపై దాడులు చేసినా ఎదురుదాడి చేయను.. ప్రజల కోసం ఏమైనా భరిస్తా.. ప్రేమించే వాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వను అంటూ రాజకీయాలను పూర్తిగా చదివేసిన వ్యక్తిలా మాట్లాడాడు. అయితే ఇంతకాలం తెలుగు సినీ వినీలాకాశంలో.. అభిమానుల చేత జేజేలు కొట్టించుకున్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక రకంగా అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. తన కారుపై విసరబడిన చెప్పు పవన్ నమ్మకాన్ని వమ్ము చేయగలిగేది కాదు..? ఆకతాయిల అల్లరికి.. గిట్టనివారి చేతలకి జడిసే స్థితిలో పవన్ లేరన్నది వాస్తవం. అదే సమయంలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌ లాంటి వారు రాజకీయాల్లో అడుగడుగునా కనిపిస్తారు.

 

పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ఇలాంటి ఎత్తుపల్లాలు అధిగమించాల్సి ఉంది. ఇప్పటికే పవన్ వైఖరిపై పలువురు రాజకీయ కురువృద్ధులు.. మేధావులు పెదవి విరుస్తున్నారు. నాడు తెలంగాణ రాకను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌కు నేడు అదే తెలంగాణపై ఉన్నట్లుండి అంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందనేది అంతుచిక్కని ప్రశ్న. జనసేన ఎందుకు స్థాపించారో పవన్‌కే క్లారిటీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసేన గురించి కానీ.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడి.. తన స్థాయినీ తగ్గించుకోలేనని కోదండరాం లాంటి వ్యక్తి అన్నాడంటే పవన్ ఎలాంటి స్థితిలో ఉన్నాడో చెప్పుకోవచ్చు.

 

అంతేందుకు ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక్క మీటింగ్ పెడితేనో.. ఓ యాత్ర చేస్తేనో ప్రజా సమస్యలపై పోరాడినట్లు కాదని.. నిరంతరం ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజల గొంతును ప్రభుత్వాలకు వినిపించేలా పోరాడితేనే పోరాడినట్లు అన్నా.. అంటూ పవన్ వీరాభిమాని ఒకరు చురక వేయడం చాలా మందిని ఆలోచింప చేస్తోంది. చూస్తుంటే సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని.. సినీ పరిశ్రమలో నడిచినట్లు రాజకీయ చదరంగంలో నడవలేమని పవన్ తెలుసుకునే రోజు అతి తొందరలోనే ఉందంటున్నారు విశ్లేషకులు.