పవన్ రాగం.. కేసీఆర్ తాళం..?

 

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి తెలంగాణ రాగం ఎందుకు ఎత్తుకున్నాడా అని సగటు అభిమానులతో పాటు రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుబట్టడం లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అంటకాగుతూ వస్తుండటం.. అక్కడికే ఓటు హక్కు మార్పించుకోవడం.. సీమాంధ్రలోనే యాత్రలు చేయడాన్ని చూస్తే.. పవన్ ఏపీకే పరిమితమవుతాడని చెప్పకనే చెబుతున్నాయి. 2019 ఎన్నికలకు సమయం ఎంతో దూరం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య జనసేనాని తెలంగాణలో యాత్ర ఎందుకు చేపట్టినట్లు..? కోదండరాంను గదుల్లోంచి బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేయించిన ప్రభుత్వం.. పవన్ యాత్రకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకపోవడం ఏంటీ..? వీటన్నింటికి ఒకటే సమాధానం కేసీఆర్.

 

నాలుగేళ్ల క్రితం తెలంగాణ వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు కేసీఆర్‌కు ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. అభివృద్ధి జరిగిపోతోందన్న ప్రచారం తప్ప నాడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలైన దాఖలాలు లేవు. తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలి.. అంతకంతకూ పుంజుకుంటున్న రెడ్లను కొట్టాలంటే.. రాజధాని ఏరియాలో.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రా సెటిలర్ల అండ కావాలి.. టీడీపీలోని మెజార్టీ నాయకుల్ని ఇప్పటికే లాగిపడేసిన కేసీఆర్‌కు... రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా ఉన్న సీమాంధ్రుల బలం కావాలి. అది దక్కాలంటే సెటిలర్లతో పాటు తెలంగాణలోనూ ఫేమస్ అయిన వ్యక్తి అండ తనకు కావాలి. ఈ క్రమంలో కేసీఆర్‌కు కనిపించిన వ్యక్తి పవన్‌కళ్యాణ్.

 

అందుకే 2014 నాటి విభేదాలను పక్కనబెట్టి మరీ రాజ్‌భవన్ సాక్షిగా ఆయనతో చేయి కలిపారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే పవన్‌ కళ్యాణ్ ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. లేదంటే కోదండరామ్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన కేసీఆర్ సర్కార్.. నేడు పవన్ కళ్యాణ్‌కు రెడ్‌ కార్పెట్ పరచడమేంటీ. లేకపోతే చిన్న చిన్న నిరసనలకే అనుమతులు ఇవ్వని గులాబీ బాస్.. జనసేన అధినేతకు అనుమతి ఇచ్చేస్తాడా..? జగన్‌ను సీమాంధ్ర పెట్టుబడిదారుగా ముద్రవేసి నాడు మానుకోటలో ఆయన్ను రాళ్లతో ఎదుర్కొన్న కేసీఆర్‌.. ఇప్పుడు పవన్ యాత్రకు అవరోధాలు లేకుండా చేయడమేంటీ.. జనసేన కార్యాలయం దగ్గర ప్రారంభమైన పవన్ కాన్వాయ్‌కి ఏ టీఆర్ఎస్ కార్యకర్తా అడ్డుపడలేదు..

 

అంతెందుకు తొలి రోజు యాత్రలో పవన్ బస చేసిన హోటల్ కూడా ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేది కావడం విశేషం. కేసీఆర్‌కు మద్దతుగా పవన్ తెలంగాణలో ప్రచారం చేస్తున్నారన్న వార్తలకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తోంది అంటూ రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇదంతా గిట్టని వారు చేస్తోన్ ప్రచారమా..? లేక పవన్- కేసీఆర్‌ల మధ్య ఏదైనా లోపాయికారి ఒప్పందం కుదిరిందా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.