అక్కడ కూడా పాలిటిక్సేనా?


 

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి అర్జెంటుగా పాలిటిక్స్‌లో ఎక్కడికో వెళ్ళిపోవాలనే కోరిక బాగా ఎక్కువైపోయినట్టుంది. ఆర్నెల్లకోసారి జనంలోకి వచ్చి పొలిటికల్ స్పీచ్‌ ఇచ్చి వెళ్ళిపోయే ఆయన మొన్నీమధ్య వైజాగ్‌లో మరోసారి బయటకి వచ్చి పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ విన్నాక పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా ఏమాత్రం నెగ్గుకు రాగలడనే విషయం మీద చాలామందికి క్లారిటీ వచ్చింది. గతంలో ఎప్పుడూ రానంతగా విమర్శలు సదరు స్పీచ్ మీద వచ్చాయి. ఎంతమాత్రం ప్లానింగ్ లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ ప్రసంగం వుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ ప్రసంగం పొలిటికల్ లీడర్లా కాకుండా సగటు సినిమా హీరో మాట్లాడినట్టుగా వుందని విమర్శలూ వచ్చాయి. పొలిటికల్ మీటింగ్‌లో పరిణతి చెందిన రాజకీయ నాయకుడి తరహాలో మాట్లాడడం ఆయనకి ఇప్పుడప్పుడే ఒంటపట్టే అవకాశం కనిపించడం లేదన్న అభిప్రాయాలూ రాజకీయ వర్గాల్లో వినిపించాయి. పొలిటికల్ మీటింగ్‌లో సినిమా హీరోలాగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ సినిమా మీటింగ్‌లో మాత్రం పొలిటికల్ లీడర్లా మాట్లాడ్డం లేటెస్ట్ వెరైటీ.

 

పవన్ కళ్యాణ్ నటించిన ’అజ్ఞాతవాసి’ సినిమా ఆడియో ఫంక్షన్లో నేచురల్‌గా పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాలి? ఆ సినిమా హీరోగా సదరు సినిమాలో విశేషాలు చెప్పాలి. సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల టాలెంట్ గురించి చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా గురించి తక్కువ చెప్పి, రాజకీయాల గురించి ఎక్కువ చెప్పారు. తన పార్టీ ఎన్నికల బరిలోకి దిగితే చాలా అవసరం కాబట్టి ఫ్యాన్స్‌కి తన హృదయంలో ఎంత గొప్ప స్థానం వుందో నాలుగైదుసార్లు చెప్పారు. తనకు, త్రివిక్రమ్‌కి వున్న అనుబంధం గురించి, డిప్రెషన్లో వున్న తనను త్రివిక్రమ్ ఎలా బయటపడేసిందీ సుదీర్ఘంగా చెప్పారు. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ తాను వ్యక్తిగతంగా ఎంత మంచోడో, సమాజం కోసం తాను ఎంతగా ఆలోచిస్తూ వుంటాడో చెప్పుకున్నారు.  దీన్నే బేలన్స్ లేకపోవడం అని పరిశీలకులు అంటున్నారు. సినిమా ఫంక్షన్లో రాజకీయాల గురించి మాట్లాడ్డం, రాజకీయ సభలో సగటు సినిమా హీరోలా మాట్లాడ్డం పవన్ కళ్యాణ్‌కే చెల్లిందని అంటున్నారు.