2019… జగన్ కు ఓ PK! చంద్రబాబుకు ఓ PK!

మన పురాణ కథల్లో చాలా సార్లు వచ్చే అంశం… బ్రహ్మాస్త్రం! బ్రహ్మాస్త్రం తిరుగులేనిది. దానికి విరుగుడు బ్రహ్మాస్త్రమే! ఇప్పుడు సీఎం చంద్రబాబు అదే ఫార్ములానే ఆచరణలో పెడుతున్నారా? అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాల నేపథ్యంలో…

 

ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య దశాబ్దాల పాతది. దాని పరిష్కారానికి ప్రయత్నాలు అడపాదడపా జరిగాయి. కాని, ఎప్పుడూ పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు. కాని, వున్నట్టుండీ పవర్ స్టార్ రంగంలోకి దిగటంతో మీడియా మొత్తం ఉద్ధానం వైపు కదిలింది. హార్వర్డ్ నుంచి నిపుణులు కూడా రావటంతో మరింత చర్చ జరిగింది. అయితే, పవర్ స్టార్ పీకే కిడ్నీ బాధితుల గురించి స్పందించటం ఒక ఎత్తైతే … ఆయనతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కావటం మరో ఎత్తు! అలాగే, పవన్ కళ్యాణ్ ప్రయత్నాన్ని సీఎం మెచ్చుకోవటం, అనేక విషయాలు పీకే, సీబీఎన్ చర్చించుకోటం… కొంత మేర భవిష్యత్తును మనకు చూపిస్తోందనే చెప్పాలి!

 

పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో వుంటారని టాక్ బయలుదేరింది. అందుకు తగ్గట్టే పవన్ కళ్యాణ్ పాదయాత్రపై కూడా స్పందించారు. అంటే… మరో రెండు, మూడు నెలల తరువాత కీలక పరిణామాలే జరగనున్నాయన్నమాట. అయితే, పీకే అధికారంలో వున్న టీడీపీని ఏకపక్షంగా టార్గెట్ చేస్తాడా? లేదా 2014లో లాగానే చంద్రబాబుకి మద్దతిస్తాడా? ఈ రెండూ కాక మరేదైనా స్ట్రాటజీ వుంటుందా? ఇలాంటి ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాలు లేవు. కాని, ఉద్ధానం ఎపిసోడ్ నేపథ్యంలో సీఎంతో పవన్ కళ్యాణ్ మూవ్ అయిన తీరు… జగన్ కు ఆందోళన కలిగించేదే! టాలీవుడ్ పీకే టీడీపీ అధినేతకి క్లోజ్ గా వున్నట్టే ప్రస్తుతానికి సంకేతాలు అందుతున్నాయి…

 

ఒకవేళ పవర్ స్టార్ చంద్రబాబు తరుఫున వచ్చే ఎన్నికల్లో బరిలో వుంటే… అది ఆయనకు పెద్ద బలమే! ఎందుకంటే, ఎలాగైనా సీఎం అవ్వాలని కసితో వున్న జగన్ వ్యూహాల కోసం ఉత్తరాది పీకేను మోహరించారు! పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఉధృతంగా వైసీపిని మార్పులు, చేర్పులకి గురి చేస్తున్నారు. సర్వేలు, సమావేశాలతో హడావిడి చేస్తున్నారు. ఈ సమయంలో జగన్ నమ్ముకున్న పీకేకి విరుగుడు మన టాలీవుడ్ పీకేనే అయ్యేలా వున్నారు. అపర చాణుక్యుడైన చంద్రబాబు పవర్ స్టార్ ని తమ తరుఫున మోహరించగలిగితే అది జగన్ కు ఆందోళక కలిగించే పరిణామమే!

 

ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ తన జనసేన టీడీపీకి మద్దతుగా వుండబోతోందని చెప్పలేదు. ఎన్నికల దగ్గర పడ్డ కొద్దీ పొత్తులు అనివార్యం అవుతాయి. మరి దశాబ్దాలుగా అద్భుతమైన క్యాడర్ బలమున్న టీడీపీతో పీకే కలుస్తారా? జగన్ గారి పీకేకి విరుగుడుగా నిలుస్తారా? రానున్న ఎన్నికల్లో ఉత్తరాది పీకే ప్లానింగ్ వర్సెస్ దక్షిణాది పీకే ఫాలోయింగ్… మనం చూడొచ్చా? వి హ్యావ్ టూ వెయిట్!