అది పవన్ చివరి మీటింగా?
Published on: Fri Mar 28, 2014 4:09PM
.jpg)
గురువారం నాడు వైజాగ్‌లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన మీటింగ్ ‘జనసేన’ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ నిర్వహించే చివరి మీటింగ్‌గా భావించవచ్చని, భవిష్యత్తు ‘జనసేన’ పేరుతో పవన్ కళ్యాణ్ మరో మీటింగ్ పెట్టే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరిపిన సభ ‘జనసేన’ తొలిసభ అయితే, వైజాగ్‌లో జరిగింది చివరి సభగా భావించవచ్చని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అచ్చ తెలుగు ఆంధ్రుడు కాబట్టి ‘జనసేన’ విషయంలో ఆయనది ఆరంభ శూరత్వంగా భావించడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
‘జనసేన’ పార్టీ ని ప్రకటించాక, నరేంద్రమోడీని కలిసి వచ్చాక పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని రాజకీయ ఉద్ధండులందరూ తన వెంట పడతారని పవన్ కళ్యాణ్ ఊహించాడు. అయితే అలాంటిదేదీ జరగలేదు. ప్రస్తుతం వున్న రాజకీయ పరిస్థితులకు పవన్ కళ్యాణ్ వంటి అనవసర ఆవేశపరుడు సెట్ కాడన్న సత్యాన్ని గ్రహించడం వల్లే ఆయన వెనుక రాజకీయ నాయకులు క్యూ కట్టలేదు. ఇదే కాక పార్టీని ప్రకటించిన తర్వాత అనేక విషయాలలో పవన్ కళ్యాణ్ ఆశించిన డెవలప్‌మెంట్స్ కనిపించలేదు.
మనసులో రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి మద్దతు ఇవ్వాలనే కోరిక వున్నా, తనంతట తాను తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే ఇగో అడ్డు రావడంతో తెలుగుదేశానికి కూడా చేరువ కాలేకపోయాడు. ఫలితం.. ఈసారి ఎన్నికలలో పోటీచేసే అవకాశాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. మిగతా పార్టీలలో పవన్ కళ్యాణ్‌ని ఉపయోగించుకోవాలని అనుకునే పార్టీలే తప్ప పవన్ కళ్యాణ్‌కి ఉపయోగపడే పార్టీలేవీ లేవు.
ఇంకా పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ నిర్వహణకు అయ్యే వ్యయం... ఇవన్నీ పవన్ కళ్యాణ్‌కి జ్ఞానోదయం కలిగించాయి. ఒక రాజకీయ పార్టీని కొనసాగించడం అనేది ఆషామాషీ విషయం కాదన్న సంగతిని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ మెల్లగా పార్టీ, ఎన్నికలు, పోటీ చేయడం వంటి అంశాల నుంచి తప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించాడని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వైజాగ్‌లో పవన్ చేసిన ప్రసంగం ఈ ధోరణిలోనే సాగిందని ఆ వర్గాలు అంటున్నాయి.


