TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రిషికొండ ప్యాలెస్‌‌లో ఊడిన పెచ్చులు..పరిశీలించిన డిప్యూటీ సీఎం

Published on: Fri Aug 29, 2025 3:31PM

 

విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ప్యాలెస్‌‌లో స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. కాన్ఫరెన్స్ హాల్, మరో రెండు గదుల్లో ఫాల్స్ సీలింగ్ షీట్లు విరిగిపడినాయి. పైకప్పు లోపాలతో లోపలికి వర్షం నీరు వచ్చింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ను పరిశీలించి తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

విశాఖపట్నం పర్యటనలో ఉన్నడిప్యూటీ సీఎం ... మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండకు చేరుకున్నారు. భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్ రూమ్‌లు, బాత్ రూమ్‌లను చూసి విస్తుపోయారు. ప్రజాధనంతో ఇలాంటి ప్యాలెస్ లు అవసరమా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పవన్ కల్యాణ్‌కు వివరించారు. 

గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏటా సుమారు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని తెలిపారు. కానీ, ఇప్పుడు ఈ నూతన భవనాల నిర్వహణకే దాదాపు కోటి రూపాయల బిల్లులు బకాయి పడిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భవనాల నిర్మాణంపై ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని అధికారులు పవన్‌కు తెలిపారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది కూడా పోతుంది" అని వ్యాఖ్యానించారు.

 రుషికొండ భవనాల నిర్మాణం, ఖర్చు, పర్యావరణ విధ్వంసం వంటి అన్ని అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నిర్మాణాలను పరిశీలించడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా, వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకు వచ్చానని తెలిపారు. పాడైపోతున్న భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను  పవన్ ఆదేశించారు.