కృష్ణాడెల్టాకు జీవనాధారంగా పట్టిసీమ.!
Published on: Sat Jul 11, 2026 5:01PM

సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులలో కూడా కృష్ణా డెల్టా ఆయకట్టును పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరోసారి ఆదుకుంది. కృష్ణా బేసిన్ పరిధిలోని ఎగువ జలాశయాలన్నీ అడుగంటిపోవడంతో కృష్ణా డెల్టా పరిధిలోని వ్యవసాయ భూములు ఎండిపోయే ప్రమాదం నుంచి గోదావరి వరద జలాలను కృష్ణా నదికి తరలించడం ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు జీవనాధారంగా నిలిచింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమతో పాటు తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను అధికారికంగా పునఃప్రారంభించి, కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదలను పునరుద్ధరించారు.
ప్రస్తుత సీజన్‌లో ఎల్ నినో పంజా విసరడం వల్ల రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో అన్నపూర్ణగా పేరొందిన జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎండల తీవ్రతకు జలాశయాల్లోని నీరు ఆవిరైపోయే పరిస్థితులు తలెత్తాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులు ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వైపు నుంచి ఎగువ ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో సముద్రంలో వృథాగా కలిసిపోయే గోదావరి నీటిని కృష్ణా డెల్టా వైపు మళ్లించేందుకు తెలుగుదేశం నిర్మించిన పట్టిసీమ పథకం దోహదపడింది.
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చాలా సమయం పడుతుంది కనుక, తక్షణ ఉపశమనంగా 1,300 కోట్ల రూపాయల వ్యయంతో రికార్డు కాలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. అయితే.. ఆ సమయంలో ఈ ప్రాజెక్టు తీవ్ర రాజకీయ వివాదాలకు, విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ఒట్టిసీమగా అని అభివర్ణించారు. అయితే ఆ పట్టిసీమే కృష్ణా డెల్టాను ఆదుకుని అప్పడే గట్టి సీమ అని నిరూపించుకుంది. ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ పట్టిసీమను పూర్తిగా విస్మరించారు.
ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూపర్ ఎల్ నినో పరిస్థితుల్లోనూ రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా వరప్రదాయినిగా ఆదుకుంటోంది. ప్రాజెక్టు పునఃప్రారంభం సందర్భంగా గోదావరి జలాలకు మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి.. మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు దార్శనికతకు నిలువెత్తు సాక్ష్యంగా పట్టిసీమను అభివర్ణించారు. పట్టిసీమ ప్రాజెక్టు రాష్ట్ర వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచిందన్నారు. ఇప్పటివరకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రికార్డు స్థాయిలో 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు విజయవంతంగా మళ్లించగలిగామన్న రామానాయుడు.. ఈ నీటి సరఫరా కారణంగా కృష్ణా డెల్టా పరిధిలో పంటలు సమృద్ధిగా పండటమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ. 50 వేల కోట్లకు పైగా సంపద, ఆదాయం చేకూరిందని గణాంకాలతో వివరించారు.
ఐదేళ్ల జగన్ పాలన కేవలం రాజకీయ వైషమ్యాలు, అవగాహనా రాహిత్యం కారణంగానే గత ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్వహణను పూర్తిగా గాలి కొదిలేసిందని విమర్శించారు. ఒకప్పుడు ఈ ప్రాజెక్టును అవహేళన చేసిన వారే.. కృష్ణా డెల్టా కరవు కోరల్లో చిక్కుకున్న వేళ ఈ నీటిపైనే ఆధారపడాల్సి వచ్చిందన్నారు. పట్టిసీమపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసిన వైఎస్ జగన్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కృష్ణా డెల్టా రైతులకు సమాధానం చెబుతారని మంత్రి నిలదీశారు.
Pattiseema Lift Irrigation, Krishna Delta, Nimmala Ramanaidu, El Nino AP Drought, Chandrababu Naidu Water Management


