TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పఠాన్‌కోట్ తీవ్రవాదికి చైనా మద్దతు

Published on: Fri Apr 1, 2016 4:14PM


 

పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం మీద దాడికి వ్యూహం పన్నిన తీవ్రవాదులకు చైనా మద్దతు పలుకుతోందా.... అంటే అవుననే జవాబు వినిపిస్తోంది. పఠాన్‌కోట్‌ దాడులకు పాల్పడిన జైష్‌-ఏ-మహమ్మద్‌ నాయకుడు మౌలానా మసూద్‌ అజార్‌ మీద నిషేధాన్ని విధించాలని కోరుతూ మన దేశం ఐక్యరాజ్యసమితిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ విషయం మీద సమితిలో ఉన్న 15 మంది సభ్య దేశాలలో 14 దేశాలు సానుకూలంగా స్పందించగా, ఒక్క చైనా మాత్రం ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో మౌలానా అజార్‌ పాకిస్తాన్‌లో ఎప్పటిలాగే స్వేచ్ఛగా తిరిగే అవకాశం చిక్కింది.

 

ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత సభ్య దేశాలలో ఒకటైన చైనా ఈ ప్రతిపాదనకు నిరాకరించకపోవడంతో, మెజారటీతో సంబంధం లేకుండా ప్రతిపాదన వీగిపోయింది. తన పరమమిత్ర దేశమైన పాకిస్తాన్‌ సూచన మేరకే, చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో భారత్‌, చైనాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆది నుంచి కూడా చైనా, భారత్‌ ఉద్దేశాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ... ఏకంగా మన దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తీవ్రవాదిని రక్షించేందుకు పూనుకోవడం విమర్శకులకు సైతం విస్మయం కలిగిస్తోంది. ఈ విషయం మీద పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా మండిపడుతున్నారు.