పఠాన్‌కోట్ సంఘటనలో అజార్ అమాయకుడు- పాక్!
Published on: Mon Feb 8, 2016 3:38PM

అంతా అనుకున్నట్లే జరిగింది. కాకపోతే కాస్త వెనుకా ముందుగా… అంతే! ‘మీ దేశంలో తలదాచుకుంటున్న మౌలానా అజార్, మా దేశంలోని పఠాన్‌కోట్ మీద దాడి చేయించాడు’ అని భారతదేశం ఎంతగా మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. దీనికోసం మనదేశం అందించిన సాక్ష్యాధారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. భారతదేశం ఇలాంటి ఆరోపణలు చేయగానే పాకిస్తాన్ కాస్త హడావుడి చేయడం, వేడి చల్లారిన తరువాత మాకేం తెలియదు పొమ్మంటం కొత్తేమీ కాదు. ఈసారి కూడా పాకిస్తాన్, మన దేశం అందించిన సాక్ష్యాలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. అజార్ నేతృత్వం వహిస్తున్న ‘జైష్- ఏ- మహమ్మద్’ (JeM) తీవ్రవాద సంస్థకి చెందిన కొందరిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఆ సంస్థ నాయకుడైన అజార్ జోలికి కానీ... అతని కుడి, ఎడమ భుజాల వంటివారి జోలికి కానీ పోలేదు. ఈ తతంగం అంతా జరుగుతుండగానే, తన జోలికి వస్తే ఊరుకునేది లేదని అజార్ పరోక్షంగా ఏం ఖర్మ ప్రత్యక్షంగానే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.
ఎట్టకేళకు ఆయన పంతమే నెగ్గినట్లుంది! పఠాన్‌కోట్ దాడికి అజార్ పురికొల్పాడని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవంటూ విచారణ బృందం చేతులెత్తేసింది. ఈ మేరకు తమ ప్రభుత్వాధినేతలకు ఒక నివేదికను కూడా సమర్పించింది. మహా అయితే అజార్‌కు ‘తెలియకుండా’ ఆయన శిష్యులు ఎవరన్నా ఈ పని చేసి ఉండవచ్చని తేల్చింది. భారతదేశం తన మీద తానే దాడి చేసుకుని పాకిస్తాన్ మీద నింద వేస్తోందని మరో నివేదికలో పేర్కొన్నా ఆశ్చర్యపోనవసరం లేదేమో! పఠాన్‌కోట్ వైమానిక స్థావరం మీద జరిగిన దాడిలో ఏడుగురు వీరజవాన్లనూ, మన రక్షణ దశాల పరువునూ కోల్పోయిన భారత ప్రభుత్వం ఇప్పుడు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!


