అడ్డొస్తే తొక్కేస్తానంటున్న యోగా గురు...!

 

ప్రస్తుతం ప్రవచనాలు పక్కన పెట్టిన బాబాలు బిజినెస్ బాట పడుతున్నారు. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ బాస్మతి బియ్యం నుంచి కాస్మోటిక్ ప్రొడక్ట్స్‌ వరకూ అన్ని ఉత్పత్తుల్లోనూ విదేశీ కంపెనీలు ఖంగుతినే రేంజ్‌లో వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరిస్తూ ఉన్నారు. ఆయుర్వేదానికి పెరుగుతున్న డిమాండ్‌ను పసిగట్టి పతంజలి ఆయుర్వేద పేరుతో వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు. ఆయుర్వేదం ప్రపంచంలోని అతిపురాతన వైద్య పద్ధతులతో ఒకటి. దీని మీద అనేక సంస్థలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. అయినా ప్రచార లోపం వల్ల ప్రజాదరణ పొందలేదు. అయితే యోగా గురుగా దేశం మొత్తం పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటంతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న అనుచరగణం, ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు రాందేవ్ పతంజలికి ఎదురులేకుండా చేశాయి. వరుస విజయాలతో దూకుడు మీదున్న బాబా రిటైల్ వ్యాపారంలో పేరు పొందిన బహుళజాతి సంస్థలతో పోటీకి సై అంటున్నారు. అనడమే కాదు ఇప్పటికే తనకు పోటీగా ఉన్న చాలా సంస్థలను కోలుకోలేని దెబ్బ తీశారు..ఇంకా తీస్తూనే ఉన్నారు.

 

వినియోగవస్తు వ్యాపారంలో పేరు పొందిన డాబర్, ఇమామి వంటి దేశీయ కంపెనీలకు రాందేవ్ సంస్థ గట్టిపోటీ ఇచ్చింది. టూత్ పేస్ట్ రంగంలో కోల్గేట్-ఫాల్మొలివ్ వాటా బాగా తగ్గిపోయింది. అలాగే లయన్‌ షేరుతో ఉన్న క్లోజప్ లాంటి ప్రొడక్ట్‌ను నేల మీదకు దించింది పతంజలి. గత ఏడాది డిసెంబర్‌లో నూడిల్స్‌లో ఫంగస్ రావడంతో స్విస్ కంపెనీ మ్యాగీని ప్రభుత్వం నిషేధించింది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకుని పతంజలి దేశీ నూడిల్స్‌ను తయారు చేసి క్యాష్ చేసుకున్నారు రాందేవ్. ఈ వరుస విజయాలు ఎప్పటి నుంచో ఈ రంగంలో ఉన్న దిగ్గజ కంపెనీల పాలిట శాపమైయ్యాయి.

 

పతంజలి నుంచి ఎదుర్కొంటున్న గట్టి పొటి తమ కంపెనీ ఉత్పత్తులపై ప్రభావం చూపుతోందని సాక్షాత్తూ ఆ కంపెనీ సీఈవోనే ప్రకటించారు. ఇప్పటి వరకు ఎఫ్ఎంసిజీ రంగంలోని కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పతంజలి తాజాగా ఆరోగ్య ఆహార పానీయాల రంగంలోని పెద్ద సంస్థలతో ప్రత్యక్ష యుద్ధానికి దిగింది.  గ్లాస్కో  తయారు చేసే హార్లిక్స్‌కు పోటీగా పవర్ వీటా పేరుతో కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని వల్ల జీఎస్‌కె హార్లిక్స్‌తో పాటు, బోర్నవీటా, కాంప్లాన్ వంటి ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. వీటన్నింటితో పతంజలి ప్రస్తుత ఆదాయం డాబర్, ఎమామీ, మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్ వంటి బడా సంస్థల ఆదాయంతో సమానమని హెచ్‌ఎస్‌బీసీ సర్వేలో తేలింది.