పతంజలి..పైకి అంతా మాయేనా..?

పతంజలి..ఈ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది యోగా గురు రాందేవ్ బాబానే.. మరుగును పడిపోతున్న యోగాకు మళ్లీ పునర్వైభవాన్ని తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అదే బాటలో..అంతే శక్తివంతమైన భారతీయ ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు గాను నడుం బిగించారు. పతంజలి బ్రాండ్‌ పేరుతో కంపెనీని స్థాపించి ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చారు రాందేవ్..వచ్చీ రావడంతోనే కార్పోరేట్ కంపెనీలకు దడ పుట్టించింది. తొలుత ఆయుర్వేద ఔషధాలనే తయారు చేయాలని రాందేవ్ భావించారు. అయితే ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో క్రమంగా ఆహారోత్పత్తులు, సౌందర్య ఉత్పత్తుల తయారీని ఆయన ప్రారంభించి 500 రకాల ఉత్పత్తులను అందించే స్థాయికి ఎదిగింది పతంజలి..

 

ఈ సంస్థ దూకుడుతో ఎన్నో ఏళ్లుగా భారతీయ ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను శాసిస్తున్న ఐటీసీ, డాబర్, హిందూస్థాన్ యూనిలీవర్. కోల్గేట్, పీ&జీ వంటి సంస్థలకు ముచ్చెమటలు పట్టాయి. 2016 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 146 శాతం పెరుగుదలను నమోదుచేసి..769 మిలియన్ డాలర్ల నికర లాభాన్ని సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలా భారతీయతకు..భారతీయ వారసత్వానికి జవసత్వాలు అందజేసిన వ్యవస్థగా పతంజలికి గుర్తింపు వస్తున్న తరుణంలో ఆ సంస్థ మాజీ సీఈవో ఎస్‌కే.పాత్రా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పతంజలి 10,500 కోట్ల టర్నోవర్ సాధించడంలో ముఖ్యభూమిక పోషించడంలో నిజమైన శ్రామికులు కంపెనీ ఉద్యోగులేనని కానీ వారికి నేటి వరకు సరైన వేతనం అందడం లేదన్నది పాత్రా ప్రధాన ఆరోపణ.

 

సేవ పేరుతో వారి శ్రమను దోపిడి చేస్తున్నారని ఆయన అన్నారు. రెండు ఉద్యోగాలకు విడి విడిగా వేతనం చెల్లిస్తామని మొదట హామీ ఇచ్చారని కానీ అలా జరగలేదని.. తాను సీఈవోగా ఉన్నప్పుడు పతంజలి ఆయుర్వేద, పతంజలి ఫుడ్‌పార్క్‌లో ఒకేసారి రెండు విధులు నిర్వర్తించానని పేర్కొన్నారు. తనకు వేతనం ఆపడంపై పాత్రా పలుమార్లు బాబా రాందేవ్‌తో వాగ్వివాదానికి దిగారు. నాకు వేతనం కావాలి..నా కోసం కాదు..నాకో కుటుంబం ఉంది. వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అందుకోసమైనా నాకు జీతం కావాలి అంటూ బాబాను వేడుకున్నానని దీంతో తనకు జీతం చెల్లించారని..అది కూడా ముందు హామీ ఇచ్చినట్లు కాకుండా ఒక ఉద్యోగానికి వేతనం ఇచ్చారని ఆరోపించారు.

 

రాందేవ్‌ పతంజలిని స్థాపించిన తర్వాత ఆ సంస్థపై ఈ స్థాయిలో ఆరోపణలు వచ్చింది లేదు..మొదట్లో నూడిల్స్‌లో పురుగులు వచ్చినట్లు తేలడం..పతంజలి నూడిల్స్‌కి లైసెన్స్‌ లేదంటూ ఆహార భద్రత (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటికే నెస్లే వంటి అంతర్జాతీయ దిగ్గజానికి నోటీసులు అందడంతో పతంజలిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అలా కాదు..ఆరోపణలు చేసిన వ్యక్తి సంస్థలో ఒక మాజీ ఉద్యోగి..అది కూడా సీఈవో స్థాయి వ్యక్తి కావడంతో ఈ వ్యాఖ్యలకు కార్పోరేట్ ప్రపంచంలో హాట్ చర్చకు దారి తీసింది. మరి పాత్రా ఆరోపణలపై బాబా రాందేవ్ ఎలా స్పందిస్తారో..?