TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ లో తత్కాల్ పాస్ పోర్ట్ కుంభకోణం

Published on: Wed Feb 15, 2012 2:55PM

ఫోర్జరీ సర్టిఫికెట్లతో మాయాజాలం చేస్తున్న ఏజెంట్లు
తెలుగువన్.కామ్ పరిశోధనాత్మక వ్యాసం


హైదరాబాద్: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో కొంతకాలంగా గుట్టుచప్పుడుకాకుండా భారీ స్కామ్ జరుగుతోంది. విదేశాలకు వెళ్లే ప్రయాణీకుల అవసరాలు, ఆదుర్దాను పాస్ పోర్ట్ కార్యాలయంవద్ద తిష్టవేసిన ఏజెంట్లు తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు. తత్కాల్ పాస్ పోర్ట్లకు పోర్జరీ చేసిన సర్టిఫికెట్లను సబ్ మిట్ చేసి నిత్యం వేలాది రూపాయలు దండుకుంటున్నారు.

 

 వ్యాపార, ఉద్యోగ, ఇతర అవసరాల నిమిత్తం అప్పటికప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి పాస్ పోర్ట్ లేకపోతే తత్కాల్ పథకం కింద దరఖాస్తు చేస్తే వెంటనే పాస్ పోర్ట్ తెచ్చుకోవచ్చు. ఈ తత్కాల్ పాస్ పోర్ట్ కావాలంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, సైనిక ఉన్నతాధికారులు ఒక సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది. తత్కాల్ కు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి తనకు చాలాకాలం నుంచి తెలుసునని, వీరిలో ఎవరో ఒకరు తమ లెటర్ హెడ్ పై రాసి సంతకం పెట్టి ఇవ్వాలి. ఇలా ఇచ్చిన సర్టిఫికెట్ ను పాస్ పోర్ట్ కార్యాలయంలో సమర్పిస్తే పాస్ పోర్ట్ సునాయాసంగా పొందవచ్చు. అయితే పాస్ పోర్ట్ కార్యాలయం వద్ద ఉన్న దాదాపు 200 మంది అనధికార ఏజెంట్లలో కొంతమంది ఈ సర్టిఫికెట్లను  పోర్జరీచేసి దరఖాస్తుదారులకు రూ.5 నుంచి 10 వేలకు విక్రయిస్తున్నారు. తత్కాల్ కు దరఖాస్తు చేసేవారిలో చాలామందికి ఐఎఎస్, ఐపిఎస్ వంటి అధికారులతో పరిచయాలు ఉండవు. అయితే వారి సర్టిఫికెట్ లేనిదే పాస్ పోర్ట్ రాదు. ఇది ఏజెంట్లకు వరంలా మారింది. ఎవరన్నా తత్కాల్ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసి వెరిఫికేషన్ సర్టిఫికెట్ కోసం తంటాలు పడుతుంటే వారిని ఈ ఏజెంట్లు ఆశ్రయించి తమకు పలానా అధికారి తెలుసని రూ.5 వెలిస్తే రెండు రోజుల్లో వారి సంతకంతో ఉన్నసర్టిఫికెట్ తెస్తానని చెబుతారు. ఒకవేళ వెంటనే కావాలంటే రూ.10 వేలిస్తే రెండు గంటల్లో ఆ సర్టిఫికెట్ ఇస్తామని అంటారు. విదేశాలకు వెళ్ళే హడావిడిలో ఉండే ప్రయాణీకులు డబ్బుకోసం ఆలోచించకుండా సర్టిఫికెట్లకోసం ఏజెంట్లను నమ్ముకుంటున్నారు. ఈ  ఏజెంట్లు అప్పటికప్పుడు సర్టిఫికెటట్లు తెచ్చి దరఖాస్తుదారులకు ఇస్తున్నారు. కానీ ఇటువంటి దరఖాస్తులో అత్యధికం పోర్జరీవని తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 200 మంది నిత్యం తత్కాల్ పాస్ పోర్ట్ ల కోసం దరఖాస్తులు చేస్తుంటారు. ఇక్కడ రోజుకు 40 నుంచి 50  తత్కాల్ పాస్ పోర్టులు జారీ చేస్తుంటారు. పని ఒత్తిడిలో ఉన్న పాస్ పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఏజెంట్ల ద్వారా వస్తున్న సర్టిఫికెటట్లు అసలైనవో, నకిలీవో వెరిఫై చేయలేకపోతున్నారు. దీనికితోడు కొందరు పాస్ పోర్ట్ కార్యాలయం సిబ్బంది ఏజెంట్లతో కుమ్మక్కై నకిలీ సర్టిఫికెట్లను ఆమోదిస్తున్నారు. ఇటీవల రెండు సంఘటనల్లో ఇటువంటి నకిలీ సర్టిఫికెట్ల భాగోతం బైటపడింది. అయినా పెద్దగా అక్రమార్కులపై చర్యలేమీ తీసుకోకపోవడంతో తత్కాల్ సర్టిఫికెట్ల స్కామ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.