ఎవరినీ వదిలిపెట్టేది లేదు- అరుణ్‌జైట్లీ
Published on: Wed Mar 2, 2016 5:40PM

వివాదాస్పద ఎయిర్‌సెల్-మాక్సిస్ కుంభకోణానికి సంబంధించి మరోసారి పార్లమెంటు అట్టుడికింది. ఈ కుంభకోణంలో ఆనాటి ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడైన కార్తి చిదంబరానికి పాత్ర ఉందనీ, దీని మీద క్షుణ్నంగా దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఎయిర్‌సెల్, మాక్సిస్... ఈ రెండు సంస్థలూ కూడా తమిళ మూలాలు కలిగిన వ్యక్తులు నెలకొల్పినవే. ఈ రెండు సంస్థలూ కలిసి 2G టెలికాం కుంభకోణానికి పాల్పడ్డాయన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో కార్తి చిదంబరం చాలా చురుగ్గా వ్యవహరించారన్నది ప్రతిపక్షాల వాదన. దీని మీద లోక్‌సభలో అరుణజైట్లీ స్పందిస్తూ, ఎయిర్‌సెల్-మాగ్సిస్ వ్యవహారానికి సంబంధించి తాము సంబంధిత పత్రాలన్నింటినీ వెలికి తీయిస్తున్నామనీ, ఇందులో నిందితులుగా తేలేవారు ఎంత పెద్దవారైనా వదలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడు తమిళనాట జరగనున్న ఎన్నికలలో, ఈ కుంభకోణం అన్నాడీఎంకేకు గొప్ప వరంగా మారనుంది. ఇదివరకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పి.చిదంబరం ఉన్న సమయంలోనే, ఆయన అంగీకారంతోనే ఈ కుంభకోణం సాగిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల ప్రమేయం కూడా ఉన్నట్లు అన్నాడీఎంకే ఆరోపిస్తోంది.


