వైసీపీ ఎంపీల రాజీమానా... ఏపీ భవన్‌ వద్ద దీక్ష...!


అనుకున్నదే జరిగింది. అవిశ్వాస తీర్మానం పేరు ఎత్తకుండానే  స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను నిరవధిక వాయిదా వేశారు. ఇటు అవిశ్వాసంపై కానీ, అటు అన్నాడీఎంకే ఎంపీలు డిమాండ్ చేస్తున్న కావేరి బోర్డుపై కానీ ఎలాంటి ప్రకటన లేకుండానే సభ వాయిదా పడింది. దీంతో చెప్పినట్టుగానే...  వైసీపీ లోక్ సభ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ను ఆమె ఛాంబర్ లో కలసి తమ రాజీనామాలను సమర్పించారు. రాజీనామా లేఖను సమర్పించినవారిలో ఎంపీ మేకపాటి, వరప్రసాద్, మిధున్‌రెడ్డి, వైవీసుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రాజీనామాలను ఉపసంహరించుకోవాలని, ఎంపీలుగా కొనసాగుతూనే పోరాటం చేయాలని సూచించారు. కానీ దీనికి  వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర హక్కుల కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. అయితే ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా.. లేదా పెండింగ్‌లో ఉంచుతారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు... ఏపీ భవన్‌ కు వెళ్లి అక్కడ ఆమరణదీక్షను చేపట్టనున్నారు.