చర్చకు రాని అవిశ్వాసం... ఎంపీల ఆగ్రహం


కేంద్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ ఎంపీలు, వైకాపా ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈరోజు  కూడా  అవిశ్వాస తీర్మానం చర్చకు రాలేదు. ఉదయం 11 గంటలకు మొదలైన సభ క్షణాల్లోనే 12 గంటల వరకూ వాయిదా పడగా, ఆపై 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తరువాత కూడా పలు పార్టీల సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించడంతో స్పీకర్  స్పీకర్ సుమిత్రా మహాజన్  సభను రేపటికి వాయిదా వేశారు. ఇక రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. దీంతో కేంద్రం అవిశ్వాస తీర్మానంపై మొండి వైఖరిని అవలంబిస్తోందని, అందుకే నేడు కూడా చర్చ చేపట్టలేదని వైసీపీ, టీడీపీ ఎంపీలు ఆరోపించారు.

 

పార్లమెంటు వెలుపల టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన అవిశ్వాస నోటీసును స్పీకర్ రద్దు చేశారని ఎంపీ తోట నర్సింహులు అన్నారు. సభ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నట్లు కనపడలేదని, రాజకీయ ఎత్తుగడతోనే ఇలా చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఆందోళన చేసే ఎంపీలను విరమింపజేయలేదా? అని ఆయన ప్రశ్నించారు.