TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎట్టకేలకు సభలో లోక్‌పాల్ బిల్లు మార్పులకు ఛాన్స్

Published on: Thu Dec 22, 2011 3:14PM

న్యూఢిల్లీ: లోక్‌పాల్ ముసాయిదా బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల్లో వచ్చే అభిప్రాయాలను పరిశీలిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. బిల్లులో మార్పులు, చేర్పులకు అవకాశముందని ఆయన చెప్పారు.ఎట్టకేలకు లోక్‌పాల్ బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపక్షాలు ఎంతగా డిమాండ్ చేసినా, సీబీఐ పరిధిలోనే దర్యాపు విభాగం ఉంటుందని తేల్చి చెప్పేసింది. కేంద్ర మంత్రి నారాయణస్వామి బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అలాగే లోక్‌పాల్ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. లోక్‌పాల్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లుంటాయని కేంద్రం తెలిపింది. షరతులతోనే లోక్‌పాల్ పరిధిలోకి ప్రధాని ఉంటారని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. అయితే కేంద్రంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.మరోవైపు దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి డిమాండ్ చేశారు. సీబీఐని లోక్‌పాల్ పరిధిలోకి తేకుండా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడితే తమ పార్టీ మద్దతివ్వబోదని ఆమె స్పష్టం చేశారు.


కాగా, కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన లోక్‌పాల్ ముసాయిదా బిల్లుపై తమకు అభ్యంతరాలున్నాయని బీజేపీ పేర్కొంది. ఈ బిల్లు తమను నిరాశపరిచిందని బీజేపీ నాయకురాలు, ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు. లోక్‌పాల్ ముసాయిదా బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ మైనారిటీలకు స్థానం కల్పించడం, మత పరమైన రిజర్వేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.